‘దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వలేదు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందనే మాట పచ్చి అబద్ధమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ చెప్పారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా శిశుపాల వధ, రాజసూయ యాగ నిర్వహణ, దుర్యోధనుని భంగపాటు తదితర అంశాలను వివరించారు. ‘త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ.. రాజసూయం తరువాత 13 సంవత్సరాల్లో నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం చేత, భీమార్జునుల బలము చేత గొప్ప క్షత్రియ వినాశనం జరుగుతుందని ధర్మరాజుకు వ్యాసుడు చెబుతాడు. ఈ మాటలకు ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. అప్రమత్తుడవై, ఇంద్రియాలపై పట్టు కలిగి ఉండాలని వ్యాసుడు ఆదేశిస్తాడు’ అని చెప్పారు. జ్ఞానం సంఘటనలను మార్చుకోవడానికి కాదని, ప్రతికూల సంఘటనలను సైతం తట్టుకోవడానికేనని అన్నారు. ‘‘వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు ‘ఇకపై నేను పరుష వాక్యాలు పలకను, జ్ఞాతులు చెప్పినట్లు ప్రవర్తిస్తాను. ఎవరి పట్లా భేద భావం కలిగి ఉండను. ఇది నా ప్రతిజ్ఞ’ అని తమ్ములకు వివరిస్తాడు. కృష్ణుడు అప్పటికే ద్వారకకు వెళ్లిపోయాడు. రాజలోకం తిరిగి వెళ్లింది. శకుని, దుర్యోధనుడు మాత్రం మరో రెండు రోజులు మయసభలో ఉండాలనుకున్నారు. దుర్యోధనుని భంగపాటు చూసి ద్రౌపది నవ్వినట్లు వ్యాసుడు చెప్పలేదు. భీమసేనుడు, అతని సేవకులు మాత్రమే నవ్వినట్లు వ్యాస భారతం చెబుతోంది’’ అని సామవేదం స్పష్టం చేశారు. ‘‘పాండుసుతుల వైభవాన్ని చూసి అసూయా రోగానికి గురైన దుర్యోధనుడితో శకుని.. ధర్మరాజును ద్యూత క్రీడకు ఆహ్వానించాలని చెబుతాడు. దీంతో, దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ‘నేను నిప్పులలో దూకుతాను, విషం మింగుతాను’ అని బెదిరిస్తాడు. ద్రౌపది, కృష్ణుడు తనను చూసి నవ్వారని ధృతరాష్ట్రుడికి అబద్ధం చెబుతాడు. ఈ అబద్ధాన్ని పట్టుకొని కొందరు ద్రౌపది నవ్విందంటూ తప్పుడు ప్రచారం చేశారు’’ అని వివరించారు. ‘‘రాజసూయ యాగంలో మరుగుజ్జులు, భిక్షకులు కూడా భోజనం చేశారో లేదో కనుక్కున్న తరువాతనే ద్రౌపది భోజనం చేసేది. ఆమె గృహిణీ ధర్మాన్ని పాటించిన తీరును వ్యాసుడు అనేక సందర్భాల్లో వర్ణించాడు’’ అని చెప్పారు. శిశుపాల వధ వత్తాంతాన్ని వివరిస్తూ, కృష్ణుడు తన దివ్యత్వాన్ని, నారాయణ తత్త్వాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడని, దీనికి విరుద్ధంగా రామావతారంలో రాముడు తన అవతారతత్త్వాన్ని గోప్యంగా ఉంచాడని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు.


