లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
బిక్కవోలు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత బిక్కవోలులో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈఓ ఆధ్వర్యాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నేడు పీజీఆర్‌ఎస్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. విజయవాడ భవానీ దీక్షల విరమణకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వారు వచ్చిన టూరిస్టు బస్సులతో దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. ఆ భక్తులందరూ నడక దారిన సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రత్నగిరిపై పార్కింగ్ స్థలం కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. స్వామివారి వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు.
నేడు సత్యదేవుని మెట్లోత్సవం
సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత రత్నగిరి పైనుంచి దిగువకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామంలో పల్లకీపై ఊరేగించి, తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, తొలి మెట్టుకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపై సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పసుపు, కుంకుమ రాసి, హారతి ఇచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు.
లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో న్యాయమూర్తులు


