పుడమి తల్లికి పచ్చబొట్లు
● రబీ వరి నాట్లకు శ్రీకారం
● బోర్ల కింద ప్రారంభించిన రైతులు
● సాగు విస్తీర్ణం 61,326 హెక్టార్లు
● ఇప్పటి వరకూ 895 హెక్టార్లలో నాట్లు
దేవరపల్లి: ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు పూర్తి కాకుండానే రైతులు రబీ వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో.. ముందుగా ఖరీఫ్ కోతలు పూర్తయిన పొలాల్లో.. బోర్లు, కాలువల కింద వారం రోజులుగా వరి ఆకుమడులు ముమ్మరంగా వేస్తున్నారు. రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు, తాళ్లపూడి చాగల్లు, మండలాల్లో వరి నాట్లు సైతం ప్రారంభించారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకంగా లేక పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సార్వాలో ఎకరాకు 32 నుంచి 38 బస్తాల ధాన్యం దిగుబడి రావలసి ఉండగా, 25 నుంచి 28 బస్తాలు మాత్రమే వచ్చాయి. దీంతో, పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే దాళ్వాలో ఎకరాకు 55 నుంచి 60 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగి, దండిగా దిగుబడులు వచ్చి, నాలుగు డబ్బులు మిగలాలని ఆశ పడుతున్నారు.
అధిక దిగుబడులిచ్చే వంగడాలపై మొగ్గు
దాళ్వాలో అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల పంట కాల పరిమితి వండగాలయిన ఎంటీయూ–1121, ఆర్‌ఎన్‌ఆర్–15048, ఎంటీయూ–1156, ఎంటీయూ–1153 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు డీసీఎంఎస్, సొసైటీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తూండగా.. ఎక్కువ మంది రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలనే సాగు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో నారు పోసుకుని, 25వ తేదీలోగా నాట్లు వేస్తే మార్చి నెలాఖరుకు 60 శాతం పంట కోతకు వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తద్వారా మూడో పంట వేసుకునే అవకాశం కూడా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో రైతులే విత్తనాలు తయారు చేసి, అవసరమైన ఇతర రైతులకు సరఫరా చేస్తున్నారు.
నెలాఖరుకు సాగు జోరు
ఇప్పటికే ఆకుమడులను రైతులు సిద్ధం చేస్తున్నారు. పొలాలు దమ్ములు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందు కుంటాయి. రైతులకు అవసరమైన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాం. యూరి యా కొరత ఎక్కడా లేదు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 1,555 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డి విజన్‌లో 3,439 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీ లు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. – ఎస్.మాధవరావు,
జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం
రబీలో వివిధ పంటల
సాగు ప్రణాళిక (హెక్టార్లు)
వరి 61,326
మొక్కజొన్న 8,646
పెసర 434
మినుము 771
శనగ 806
వేరుశనగ 241
నువ్వులు 224
పొద్దుతిరుగుడు 187
పొగాకు 5,544
చెరకు 402
జిల్లావ్యాప్తంగా అన్ని పంటలూ కలిపి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 78,592 హెక్టార్లు. ఇప్పటి వరకూ 7,302 హెక్టార్లలో ఆయా పంటలు వేశారు. వరి 895, మొక్కజొన్న 2,800, పొగాకు 3,333 హెక్టార్లు, శనగ 254 హెక్టార్లలో వేశారు.
పుడమి తల్లికి పచ్చబొట్లు
పుడమి తల్లికి పచ్చబొట్లు
పుడమి తల్లికి పచ్చబొట్లు
పుడమి తల్లికి పచ్చబొట్లు


