
పదికి చేరిన బాణసంచా పేలుడు మృతుల సంఖ్య
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి
కాకినాడ క్రైం/అనపర్తి: ఈ నెల 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న పెను విస్ఫోటం వల్ల మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు నలుగురిని కాకినాడకు తరలించారు. వారిలో ముగ్గురు కాకినాడ జీజీహెచ్‌లో చేరగా మరో వ్యక్తి ట్రస్ట్ ఆసుపత్రిలో చేరాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్రస్ట్ ఆసుపత్రిలో చేరిన పాట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వాసంశెట్టి విజయలక్ష్మి అనే మహిళ కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ జీజీహెచ్ ఎస్‌ఐసీయూలో చికిత్స పొందుతున్న అనపర్తికి చెందిన చిట్టూరి యామిని(32) ఆదివారం తెల్లవారుజామున ఉదయం 3.19 గంటలకు ప్రాణాలొదిలింది. అదే ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (21)కాలిపోయి మాంసపు ముద్దగా మారి తుది వరకు మృత్యువుతో పోరాడాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. ఆదివారం నాటి మరణాలతో విస్ఫోటంలో తీవ్ర గాయాలపాలైన వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు.
అనపర్తిలో విషాద ఛాయలు
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారి బంధువులకు అప్పగించారు. అనపర్తికి చెందిన యామిని మృతదేహం మధ్యాహ్నం తీసుకురావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

పదికి చేరిన బాణసంచా పేలుడు మృతుల సంఖ్య