
కూలీలను కాపాడబోయి యజమాని ఆహుతి
రాయవరం: బాణసంచా ప్రమాదాల్లో సాధారణంగా కూలీలే సమిధలవుతారు. అయితే రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో కూలీలతో పాటుగా తయారీ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మృత్యువాత పడ్డారు. దీపావళి సమీపిస్తుండడం, వివాహ ముహూర్తాలకు ఆర్డర్లు వస్తుండడంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. అనుకోకుండా జరిగిన దుర్ఘటన యజమాని సత్తిబాబుతో సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు బయట కూర్చున్న సత్తిబాబు ప్రమాదంలో చిక్కుకున్న కూలీల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే మృత్యువాత పడినట్లుగా భావిస్తున్నారు. ప్రమాద జరిగిన వెంటనే ఇద్దరు కూలీలను బయటకు లాగినట్లుగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మరొకరిని బయటకు లాగే సమయంలో అప్పటికే అగ్నికీలలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మృత్యువుకు చేరువైనట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బయట కుర్చీలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికే వారని, కాని కూలీలను రక్షించే క్రమంలోనే అసువులు బాసినట్లుగా సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రం యజమాని వేల్పూరి సత్తిబాబు చెబుతున్నారు. అప్పటి వరకు బయట కూర్చున్న మృతుడు సత్తిబాబుతో తాను మాట్లాడి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లుగా సత్తిబాబు తెలిపారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు.