
ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు
జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్ మీసాల
సీటీఆర్‌ఐ: జిల్లాలోని రాజమహేంద్రవరం, ధవళేశ్వరం అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఏపీ ఎన్జీజీఓ సంఘం తాలూకా యూనిట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని సంఘ జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ మీసాల మాధవరావు అన్నారు. శనివారం స్థానిక ఏపీఎన్జీఓ సంఘ భవనంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. 7 యూనిట్లలోని, వివిధ శాఖల ఉద్యోగులు అందరూ విధిగా ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ విషయమై చర్చించడానికి ఏడు తాలూకా యూనిట్లకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం రాజమహేంద్రవరం ఏపీ ఎన్జీజీఓ భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎన్జీఓ సంఘ నాయకత్వంతో కలిసి పనిచేస్తామని మాధవరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడహక్ కమిటీ కన్వీనర్ అనిల్ కుమార్, కో చైర్మన్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి సత్యనారాయణ రాజు, జిల్లా సభ్యులు ఎన్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి.వేణుమాధవరావు పాల్గొన్నారు.
బాక్సింగ్ పోటీలలో ప్రమాణాలు నిల్
ప్రకాశం నగర్: 69వ అంతర్ జిల్లాల బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వైవీఎస్ ఉమామహేశ్వరరావు అరోపించారు. శనివారం స్థానిక ఎస్‌కేవీటీ పాఠశాలలో జరుగుతున్న పోటీలకు ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు అసోసియేషన్ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓపెన్ రింగ్ ఏర్పాటు చేయడం వల్ల పలువురు క్రీడాకారులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అందోళన వ్యక్తం చేశారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు పోటీలు నిర్వహించాల్సి ఉండగా, రోజుకు నాలుగు పోటీలు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. క్వాలిఫైడ్ జడ్జిలు, రిఫరీలు లేకుండా కేవలం బయట కోచ్‌లను తీసుకువచ్చి పోటీలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు.
శృంగార వల్లభుని ఆదాయం రూ.3 లక్షలు
పెద్దాపురం(సామర్లకోట): మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన స్వామివారి ఆలయానికి శనివారం జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,65,610, అన్నదాన విరాళాలకు రూ.1,08,476, కేశ ఖండన ద్వారా రూ.5,640, తులాభారం ద్వారా రూ.600, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,365, మొత్తంగా రూ.3,02,691 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.

ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు

ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు