
పీఠం కోసం పచ్చపాట్లు
● ఎప్పుడు ప్రకటిస్తారా అని క్యాడర్‌లో ఉత్కంఠ
● అభిప్రాయ సేకరణ జరిగి
రెండు నెలలైనా అదే జాప్యం
● పోటీలో ముగ్గురు సీనియర్లు
● దక్కేది ‘బొడ్డు’కేనని ఊహాగానాలు
● పోటీలో మరో ఇద్దరు సీనియర్లు
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎన్నిక పీటముడి వీడడం లేదు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ పూర్తయి నెలల గడుస్తున్నా.. నేటికీ ఎవరినీ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. ఆ పదవికి ఎవరిని, ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్రిసభ్య కమిటీ వచ్చి అభిప్రాయ సేకరణ చేపట్టిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అయితే.. అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడని పరిస్థితి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా కనీసం పార్టీ పదవుల భర్తీకి కూడా అధిష్టానం మొగ్గుచూపకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
అభిప్రాయ సేకరణ జరిగినా..
తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కేఎస్ జవహర్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. అంతేగాక జిల్లా కమిటీల ఏర్పాటుకు సైతం టీడీపీ అధిష్టానం పచ్చజెండా ఊపింది. జిల్లా అధ్యక్షుడి నియామకం, కమిటీల ఎంపిక కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని నేతలతో మాట్లాడి మెజారీటీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పేర్లను అధిష్టానానికి అందించనుంది. ఇందులో భాగంగా ఇటీవల బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో పాటు నియోజకవర్గానికి సుమారు 10 మంది ప్రత్యేక ఆహ్వానితుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
బొడ్డుకే అవకాశం..?
● టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సింహభాగం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ప్రత్యేక ఆహ్వానితులు సైతం ఆయన అభ్యర్థిత్వాన్నే బలపరచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. దీనికి తోడు చినబాబు అండదండలు, ఆశీర్వాదం సైతం ఆయనకే ఉండటంతో అధ్యక్ష పదవి ఎంపిక లాంఛనం కానుందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
● మరో సీనియర్ నేత గన్నికృష్ణ ఇప్పటికే రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఆశిస్తున్నారు. ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవైనా దుక్కుతుందన్న ఆశలో ఆయన ఉన్నారు.
● ఇక మరో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పదవైనా దక్కుతుందని భావించారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
సిఫార్సులకే ప్రాధాన్యం
పార్టీ విజయానికి శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారు. వాళ్లు చెప్పిన వారికే పదవులు కట్టబెట్టడంతో చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగింది. పెద్ద పదవులైతే చినబాబు చలవ లేనిదే దక్కని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం టీడీపీ నేతల్లో పార్టీపై వ్యతిరేక భావన నింపింది.
నామినేటెడ్ పదవుల
భర్తీలోనూ ఇదే తంతు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అలవిగాని హామీలు ఇచ్చేశారు. బీజేపీ, జనసేన పార్టీలకు ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల సీట్లు గల్లంతయ్యాయి. వారిని బుజ్జగించేందుకు ఆయన అప్పట్లో నామినేటెడ్ పోస్టుల మంత్రం వేశారు. కూటమి అధికారం చేపట్టిన ఏడాది వరకు ఆ పోస్టుల భర్తీకి ఎడతెగని జాప్యం జరిగింది. ఈ పరిణామం సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు నింపింది.
తమకు ఎప్పుడు న్యాయం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకానొక దశలో పార్టీ కోసం కష్టపడితే తమకు దక్కే గౌరవం ఇదేనా..? అన్న భావన వారి అనుచరుల్లో వ్యక్తమైంది. దీంతో అధిష్టానం మూడు దశల్లో నామినేటెడ్ పదవులు ప్రకటించారు.
జిల్లా అధ్యక్ష రేసులో ముగ్గురు
జిల్లా అధ్యక్షుడి రేసులో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీనియర్ నేత గన్నికృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పోటీ పడుతున్నారు. త్రిసభ్య కమిటీ సభ్యులు సైతం వీరి పేర్లే అధిష్టానానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.