వరి చేలపై తెగుళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

వరి చేలపై తెగుళ్ల దాడి

Oct 2 2025 8:26 AM | Updated on Oct 2 2025 8:26 AM

వరి చ

వరి చేలపై తెగుళ్ల దాడి

వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం

సస్యరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి

ఏరువాక శాస్త్రవేత్త నరసింహరావు

పెరవలి: అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల వలన వాతావరణంలో వచ్చిన మార్పులతో వరి చేలపై తెగుళ్లు ఆశించటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో వరిని ఖరీఫ్‌ పంటగా 1.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా నిడదవోలు నియోజకవర్గంలో 36 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ పంటపై ఆశించే తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై జిల్లా ఏరువాక శాస్త్రవేత్త సీహెచ్‌ వి నర్శింహరావు వివరించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎండ, చల్లదనం వల్ల ఖరీఫ్‌ వరి పంటపై ఎండాకు తెగులు, సుడిదోమ, తుప్పు తెగులు, మాగుడు వంటివి ఎక్కువగా ఆశించాయన్నారు. అధిక వర్షాలు వల్ల తెగుళ్ళను తట్టుకోలేని బీపీటీ 5204, పీఎల్‌ఏ 1100, ఎంటీయూ 1318, 1282, 1121, 1224 రకాలు, స్వర్ణ, పీఆర్‌ 126 రకాల సాగులో అధిక నత్రజని వాడకం, పొటాష్‌ వాడకపోవటం వల్ల తెగుళ్లు వాప్తి చెందుతున్నాయన్నారు.

ఎండాకు తెగులు

ఈ తెగులు బాక్టీరీయా వల్ల వస్తుంది. ఇది ఆకుల అంచుల నుంచి పసుపురంగుకి మారి క్రమేపీ ఎండిపోతాయి. ఈ తెగులు ఎక్కవగా అధిక వర్షాలు కురిసినప్పుడు, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఆశిస్తుంది.

నివారణ చర్యలు

ఈ తెగుళ్ల నివారణకు సరైన మందులు లేవు. బాక్టీరీయాను అరికట్టడానికి కొన్ని రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ఎండాకు తెగులు సోకిన చేలు చూస్తుండగానే ఎండిపోతాయి. దీనిని అరికట్టడానికి కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా కాఫర్‌ హైడ్రాక్సాడ్‌ మందును ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తరువాత మళ్లీ కనిపిస్తే రెండు వారాల తరువాత మరోసారి పిచికారీ చేయాలి. ఈ మందును పిచికారీ చేసినప్పుడు మరో మందును కలిపి వాడకూడదు.

మాగుడు లేక పొడతెగులు

గ్రామీణ ప్రాంతాల్లో ఈ తెగులును మాగుడు లేక పొడ తెగులు అంటారు. అధిక ఎండలు, గాలిలో తేమ శాతం 90 శాతం ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఇది ఆశించిన చేను చూస్తుండగానే ఎండిపోతుంది.

నివారణ చర్యలు

పంటలోఎంతమేర ఈ తెగులు సోకిందనేది రైతులు గుర్తించాలి. దీని నివారణకు ఎకరానికి ఎక్సోకొనోజాల్‌ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. లేదా పిప్రీకొనోజాల్‌ 200 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్‌ 400 మిల్లీలీటర్లు ఒక మిల్లీలీటరుకు 2 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. వీటిని రెండవ దఫాగా 15రోజులకు పిచికారీ చేయాలి.

తుప్పు తెగులు

ఈ తెగులు ఆశించిన వరి ఆకులపై గోధుమ వర్ణంలో తుప్పు పట్టినట్లుగా మచ్చలు ఏర్పడి క్రమేపీ పెద్దవి అయి ఆకులో పత్రహరితం లేకుండా పోతుంది. ఇలా అవ్వటం వల్ల ఆకులు ఎండిపోయి క్రమేపీ దుబ్బు కూడ ఎండిపోతుంది. ఈ తెగులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చూస్తుండగానే చేను ఎండిపోతుంది.

నివారణ చర్యలు

ఎకరానికి కార్బండిజమ్‌ 250 గ్రాములు తీసుకుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు. పిచికారీ చేసిన వారం రోజులకు మచ్చలు ఇంకా ఉంటే మరో దఫా పిచికారీ చేయాలి.

అగ్గి తెగులు

ఈ తెగులు గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఇది ఆశించిన చేలు ఆకులపై ముదురు గోధుమ మచ్చలు, ఆకులు ఎండిపోయి తగులబడినట్లుగా కనిపిస్తాయి. వెన్ను మెడభాగంలో ఈ తెగులు వ్యాపిస్తుంది. వెన్ను విరిగిపోతుంది. అంతేకాకుండా ఎరువుల్లో నత్రజని ఎక్కువైనప్పుడు కూడ ఈ తెగులు ఆశిస్తుంది.

నివారణ చర్యలు

ఈ తెగులు ఆశించిన చేల చుట్టూ గట్లపై గడ్డిని నివారించాలి. ట్రైసెక్లోజోల్‌ 6 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు.

సుడిదోమ

సుడిదోమ కాండం మొదలకు చేరి రసం పీల్చివేయటంతో ఆకులు పసుపు రంగులోకి మారిపోయి సుడులు సుడులుగా ఎండిపోతుంది. దీనిని త్వరగా అరికట్టపోతే చేను అంతా ఎండిపోతుంది.

నివారణ చర్యలు

వరిదుబ్బుకి దోమలు 10 నుంచి 15 ఉంటే ఎకరానికి పై మెట్రోజోల్‌ 120 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిదుబ్బుకి 25 నుండి 50 దోమలు ఉంటే ఎకరానికి హితోఫిన్‌ ప్లాక్స్‌ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిదుబ్బుకి 50 దోమలు దాటితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు ఎకరానికి ఎస్పేట్‌ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు.

పెరవలిలో ఎండాకు తెగులు సోకి ఎండిపోతున్న వరి చేను

ఉసులుమర్రులో సుడి దోమ ఆశించి ఎండిపోతున్న వరిచేను

వరి చేలపై తెగుళ్ల దాడి1
1/4

వరి చేలపై తెగుళ్ల దాడి

వరి చేలపై తెగుళ్ల దాడి2
2/4

వరి చేలపై తెగుళ్ల దాడి

వరి చేలపై తెగుళ్ల దాడి3
3/4

వరి చేలపై తెగుళ్ల దాడి

వరి చేలపై తెగుళ్ల దాడి4
4/4

వరి చేలపై తెగుళ్ల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement