
పీహెచ్‌సీ వైద్యుల నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యులు బుధవారం బొమ్మూరులోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం నుంచి సెంటర్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ నేతలు డాక్టర్లు సిరాజ్, భావన, తిరణ్ మాట్లాడుతూ ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులుగా పనిచేస్తున్న వారికి పీజీ సీట్లలో 30 శాతం కోటా ఉండేదన్నారు. దీనిని కూటమి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించిందన్నారు. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. దానిని ఒక ఏడాది మాత్రమే అమలు చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో ఉద్యోగంలో చేరిన వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వైద్యులకు ప్రమోషన్లు సైతం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో పీహెచ్‌సీ వైద్యులు పాల్గొన్నారు.