
పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన యువతీ యువకుల ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరన్న అనుమానంతో వారు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఉద్యోగం వస్తే ఇద్దరం ఒకటవ్వాలని ఎన్నో కలలు కన్న వారి ఆశలను ఎవరైనా తుంచేస్తారేమోనని భావించి పోతే కలిసే పోవాలనుకున్నారో ఏమో.. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని తనువు చాలించారు. దుర్గాడకు చెందిన గొల్లపల్లి దీప్తి (17)ని కొమ్మూరి అశోక్ (25) అనే యువకుడు సామర్లకోటలో గొంతు కోసి చంపి, అనంతరం తాను సైతం ఆత్మహత్య చేసుకున్న ఘటనతో బుధవారం దుర్గాడలో కలకలం రేపింది. సామర్లకోట పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన సమాచారం మేరకు అశోక్‌కు తల్లి, తండ్రి, అక్క ఉండగా దీప్తికి తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నారు. దీప్తి ఇంటర్ చదువుతుండగా అశోక్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ పేద కుటుంబాలకు చెందిన వారే.
కులాంతర ప్రేమే ప్రాణాలు తీసిందా?
ఆ యువతీ యువకులిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అశోక్‌కు 20 రోజుల క్రితం చైన్నెలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి దసరాకు సెలవుపై మంగళవారం తన స్వగ్రామం దుర్గాడ వచ్చాడు. దీప్తి సైతం సెలవుల సందర్భంగా కాకినాడలో తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి తన బంధువులతో కలిసి కాకినాడలో షాపింగ్‌కు వెళ్లిన దీప్తికి తన అక్క ఫోన్‌కు అశోక్ మెసేజ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆమె తన స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చిందని, వెళ్లి వస్తానంటూ కాకినాడలో తన కూడా వచ్చిన వారికి చెప్పి వెళ్లింది. అయితే ఎంత సేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె భందువులు ఆమె కోసం గాలించారు. ఇదే సమయంలో అశోక్ తాను చనిపోతున్నానంటూ తన బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారంతా అతని కోసం గాలింపు ప్రారంభించారు. అతని సెల్ స్విచ్ ఆఫ్ వారంతా కంగారు పడ్డారు. బుధవారం ఉదయానికి వారిద్దరు మృతి చెందినట్లు సామర్లకోట పోలీసులు ద్వారా సమాచారం అందింది.
కాగా కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నట్టు చెప్తున్నారు. తనకు ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలో అశోక్‌కు ఉద్యగం రావడంతో పెళ్లి ప్రసక్తి తీసుకురాగా ఇద్దరివీ వేరే సామాజిక వర్గాలు కావడంతో ఇంటి దగ్గర వారు ఒప్పుకోరన్న భయంతో ఈ అఘయిత్యానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమజంట ఆత్మహత్యతో
దుర్గాడలో విషాదఛాయలు

పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు

పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు