
ఏదీ ఉపాధి హామీ?
విడుదలయ్యే అవకాశం
ఉపాధి హామీ బిల్లులు జూన్ మాసం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. కూలీలు పనులు చేసిన వెంటనే ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం. త్వరలోనే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వారి ఖాతాలకు జమ చేస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపుతున్నాం. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.
– నాగమహేశ్వరరావు, డ్వామా పీడీ
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు పస్తులు తప్పడం లేదు. రోజంతా స్వేదం చిందించినా గొంతులోకి ముద్ద దిగడం లేదు. ఉపాధి హామీ కూలీలకు జూన్ నెల 25వ తేదీ నుంచి వేతనాలు స్తంభించడంతో లబోదిబోమంటున్నారు. వెరసి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారా..? అని నిరీక్షిస్తున్నారు. మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు సైతం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
రూ.34 కోట్ల బకాయిలు
వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యసాధనకు దూరంగా ఉంటోంది. సకాలంలో వేతనాలు మంజూరు చేయకపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం వ్యవసాయ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా కూలీలు ఉపాధి పనుల వైపు ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ 20 నుంచి 30 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ వేతనాల కింద రూ.34 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.15వేల నుంచి రూ.20 వేల వేతనం అందాల్సి ఉంది. ఉపాధి కూలీ డబ్బులు వస్తాయని భావించి కిరాణా దుకాణాల్లో అప్పులు చేశారు. వాటిని తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారే తప్ప.. ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.
రోజుకు సగటున రూ.276 కూలి
ఉపాధి పథకంలో వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేస్తే సగటున రోజుకు రూ.276 నుంచి రూ.343 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. సాధారణంగా ఉపాధి పథకంలో ప్రతి వారం కూలీ డబ్బులు చెల్లించడం ఆనవాయితీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలి చెల్లింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి వారం కూలి డబ్బులు చెల్లిస్తే ఇంట్లో అవసరాలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకుంటారు. జూన్ మాసం నుంచి ఉపాధి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. డబ్బు తమ ఖాతాల్లో జమకావడం లేదని కూలీలు వాపోతున్నారు. వెరసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి డబ్బు ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
రూ.10.99 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్
ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు హడావుడిగా చేపట్టారు. మినీ గోకులం, మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టారు. ఇందుకు ఇప్పటి వరకు రూ.10.99 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులు చేసి మరీ పనులు చేపడితే, సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. ప్రధానంగా రహదారుల పనుల్లో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వేసేశారు. ప్రస్తుతం బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో ఇలా...
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1.70 లక్షల జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అందులో 2.63 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. 1.26 లక్షల జాబ్‌కార్డులకు సంబంధించి 1.82 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 459 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. మహిళలకు 56.08 శాతం, ఎస్టీలకు 2.01 శాతం, ఎస్సీలకు 37.05 శాతం పనులు చూపారు. ఇప్పటి వరకు 5,271 పనులు పూర్తి చేశారు. అందులో 43.44 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పించారు.
30 లక్షల పనిదినాల లక్ష్యం
జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 29 లక్షల పనిదినాలు కల్పించారు. మిగిలినవి సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వ హయాంలో 2024 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు, బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగాయి. కూలీలతో చేపట్టే పనులు కాకుండా.. మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా పనులు నిర్వహించారు. రూ.152.13 కోట్లు వెచ్చించారు. వేతన ఖర్చుగా కూలీలకు రూ.94.49 కోట్లు, మెటీరియల్ కాంపొనెంట్‌లో భాగంగా రూ.50.50 కోట్లు ఖర్చు చేశారు. రూ.7.14 కోట్లు పరిపాలన ఖర్చుకు వెచ్చించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందని వేతనాలు
జూన్ 25వ తేదీ నుంచి తప్పని పస్తులు
జిల్లావ్యాప్తంగా
రూ.34 కోట్ల బకాయిలు
స్వేదం చిందిస్తున్నా
కడుపు నిండని దుస్థితి
ఎప్పుడు అందుతాయో
తెలియక ఆందోళన
నేడు.. రేపంటూ
అధికారుల కాలయాపన
జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 18 పంచాయతీలు : 300 మంజూరైన జాబ్‌కార్డులు : 1.70 లక్షలు కూలీలు : 2.63 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు: 1.26 లక్షలు పనులు వినియోగించుకుంటున్న కూలీలు: 1.82 లక్షలు

ఏదీ ఉపాధి హామీ?

ఏదీ ఉపాధి హామీ?