
అధరకొడుతున్న కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలలుగా రైతుల అంచనాలకు మించి ధరలు నమోదవుతున్నాయి. కురిడీ కొబ్బరి కొత్త రికార్డులు నమోదు చేస్తుండగా.. పచ్చి కాయలు సైతం ఆల్‌టైమ్ హైకి చేరాయి. తొలుత పచ్చి కొబ్బరికాయ ధర రూ.15 ఉండగా.. ఆ తర్వాత అది రూ.17కు చేరడంతో రైతులు సంబరపడ్డారు. అది కాస్తా రూ.19కి.. ఆపై రూ.20కి, రూ.22కి.. ఇప్పుడు ఏకంగా రూ.24కు చేరింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్‌లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకు పలుకుతోంది. ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి. దీంతో అంబాజీపేట మార్కెట్‌లో జోష్ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 130 లారీల కొబ్బరికాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
కురిడీకి భలే డిమాండ్..
కురిడీ కొబ్బరి ధరలు కూడా భారీగా పెరిగాయి. పాతకాయలలో గండేరా రకానికి(పెద్ద కాయ) చెందిన వెయ్యి కాయల ధర రూ.31,500 ఉంది. అదే గటగటా రకం(చిన్నకాయ) రూ.30 వేలు పలుకుతోంది. ఇక కొత్తకాయలో గండేరా రకం రూ.30 వేలు.. గటగటా రకం రూ.28,500 వరకు ధర ఉంది. కోనసీమ జిల్లా నుంచి రోజుకు 40 లారీల కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు
దక్షిణాదిలో ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు తగ్గాయి. కేరళలో 40 శాతం, తమిళనాడు, కర్ణాటకలో 30 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. దీంతో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తున్నారు.
అలాగే వరుస పండగలు కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే వినాయకచవితి వేడుకలు జరుగుతుండగా.. నెలాఖరు నాటికి దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ వెంటనే కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొబ్బరికి ఎక్కువగా ఆర్డర్లు వస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించారు.
అంబాజీపేట మార్కెట్‌లో
వెయ్యి కాయల ధర
రూ.23 వేల నుంచి రూ.24 వేలు
కురిడీ కొబ్బరి రూ.31,500కు చేరిక
ఆరు నెలలుగా
రికార్డు స్థాయిలో ధరలు
వరుస పండగల ప్రభావం