
రెవెన్యూ రికార్డుల తారుమారుపై నిరసన
గోపాలపురం: కరిచెర్లగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 150లో 137 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంపై సొంత భూ యజమానులు గురువారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారికి జరిగిన అన్యాయంపై ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కరరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. తహసీల్దారు కార్యాలయంలో 150 సర్వే నంబరుకు సంబంధించిన రికార్డును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ రీ సర్వే సమయంలో రెవెన్యూ అధికారులు కొంతమంది టీడీపీ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు కలసి రికార్డులు తారుమారు చేసినట్టు రుజువైందన్నారు. బాధితుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలను రెండు రోజుల్లో కలెక్టరుకు నివేదిస్తామన్నారు. బాధిత రైతులు విలేకరులతో మాట్లాడుతూ గోపాలపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, అప్పటి తహసీల్దారు రవీంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దారు ఎస్.కృష్ణ, రెవెన్యూ సిబ్బంది కలసి మా భూములను వేరే వ్యక్తులకు ఆన్‌లైన్ చేసి నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు సృష్టించి వేరే వ్యక్తులకు అమ్మకాలు సాగించారని ఆరోపించారు.