
బీసీ సంక్షేమ సంఘ పటిష్టతకు చర్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా, నియోజకవర్గ కమిటీలతోపాటు గ్రామ గ్రామాన రాష్ట్ర స్థాయిలో బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్ట పరచడానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక రోటరీ క్లబ్ భవనంలో గురువారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా శాఖ బీసీ సంఘ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ విద్యార్థుల వసతి గృహ సమస్యల పరిష్కారంతో సహా జాతీయ స్థాయిలో జన గణనతో పాటే కులగణన కూడా నిర్వహించాలన్నారు. కేంద్ర స్థాయిలో చట్టసభలలో బీసీ రిజర్వేషన్ ఓబీసీ సబ్ ప్లాన్‌లో ప్రత్యేక బడ్జెట్ కోసం జాతీయస్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు సాగిస్తున్నామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థలలో 34 రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమిద్దామని అన్నారు. ఈ సమావేశంలో ముచ్చకర్ల సత్యనారాయణ, బిల్డర్ చిన్న, నరవ గోపాలకృష్ణ, దొమ్మేటి సోమశంకర్, మజ్జి అప్పారావు, ఎం.సురేష్, వాసంశెట్టి గంగాధర్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.