
లక్ష్మీలావణ్యను అభినందించిన కలెక్టర్
తాళ్లపూడి: అన్నదేవర పేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఆకుల లక్ష్మీలావణ్య ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు గాను 345 మార్కులు (69%) సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు. గత నెల ఆగస్టు 11న బొమ్మూరు కలెక్టరేట్‌లో లావణ్య కలెక్టర్ ప్రశాంతిని కలిసినప్పుడు తానే స్వయంగా ‘‘మీ ఇంటికి వస్తా’’ అని చెప్పిన మాట ప్రకారం మండల పర్యటనలో భాగంగా లావణ్య ఇదే గ్రామంలో ఉండడంతో ఆమె ఇంటికి వెళ్లి లావణ్య లక్ష్మిని, ఆమె కుటుంబ సభ్యులను కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, అందుకు దివ్యాంగురాలు లావణ్య నిదర్శనమన్నారు.
మళ్లీ పెరుగుతున్న
నీటి ఉధృతి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 10.50 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రి 7గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,11,254 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. శుక్రవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.49 మీటర్లు, పేరూరులో 15.36 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.76 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 9.78 మీటర్లు, కుంటలో 18.36 మీటర్లు, పోలవరంలో 11.80 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్లు వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.
నేడు ఉత్తమ ఉపాధ్యాయ
అవార్డుల ప్రదానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఆనం కళాకేంద్రంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పంపిణీ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులను అందజేయనున్నారు. ఆంధ్రనగర్‌లోని పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ ఉపాధ్యాయుడు జీవీఎస్‌ఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం, గాంధీపురం 2 సుంకర భాస్కరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సన్యాసిరావు, ఎస్‌కేవీటీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్‌వీఎం సుబ్రమణ్యం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
9న జోన్ 2 స్టాఫ్‌నర్స్
పోస్టులకు కౌన్సెలింగ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్ 2 పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టుల కాంట్రాక్టు పద్ధతిలో భర్తీలో భాగంగా ఈ నెల 9న రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు జనవరి 2 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. వీటిని పరిశీలించి జులై 17న మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మెరిట్ లిస్టులో ఎంపికై న వారి ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన అనంతరం అదేరోజు కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగ నియామక పత్రం అందించనున్నారు.

లక్ష్మీలావణ్యను అభినందించిన కలెక్టర్