
ఎక్కడి బేళ్లు అక్కడే..
●
● మందకొడిగా పొగాకు మార్కెట్
● పెరగని ధర
● దిగులు చెందుతున్న రైతులు
● ఇప్పటి వరకూ
రూ.333.43 కోట్ల కొనుగోళ్లు
దేవరపల్లి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు దాటింది. శనివారం నాటికి 48 రోజుల పాటు వేలం నిర్వహించారు. అయినప్పటికీ, గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడి బేళ్లు అక్కడే ఉండిపోయాయి. వేలానికి తీసుకుని వెళ్లినా 40 శాతం బేళ్లు అమ్ముడవని పరిస్థితి. దీంతో, వాటిని రైతులు తిరిగి ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు. వేలం కేంద్రానికి తీసుకు రావడానికి, కొనకపోతే తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి బేలుకు దూరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.400 వరకూ రవాణా చార్జీలు అవుతున్నాయని, దీంతో అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సన్న, చిన్నకారు, కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాలకు శనివారం 3,290 బేళ్లు అమ్మకానికి రాగా, 2,160 బేళ్లు కొనుగోలు చేశారు. 1,128 బేళ్ల కొనుగోలుకు ట్రేడర్లు తిరస్కరించారు. కిలో గరిష్ట ధర రూ.290, కనిష్ట ధర రూ.205, సగటు ధర రూ.275.55 చొప్పున పలికాయి. వేలంలో 14 కంపెనీలు పాల్గొంటున్నాయి. రెండు మూడు కంపెనీలు మాత్రమే ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేస్తూండగా, మిగిలిన కంపెనీలు మొక్కుబడిగా కొంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గరిష్ట ధర కిలో రూ.290 ఉన్నప్పటికీ 10 శాతం బేళ్లకు మాత్రమే ఆ ధర పలుకుతోందని చెబుతున్నారు. మిగిలిన బేళ్లకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొగాకు రైతులు దిగులు చెందుతున్నారు.
వేలం కేంద్రాల వారీగా పొగాకు కొనుగోళ్లు (మిలియన్ కిలోల్లో)
వేలం కేంద్రం కొనుగోళ్లు
దేవరపల్లి 1.91
జంగారెడ్డిగూడెం–1 3.07
జంగారెడ్డిగూడెం–2 2.40
కొయ్యలగూడెం 2.04
గోపాలపురం 2.65
మొత్తం పొగాకు ఉత్పత్తి అంచనా : సుమారు 80 మిలియన్ కిలోలు
ఇప్పటి వరకూ కొన్న పొగాకు : 12.10 మిలియన్ కిలోలు
దీని విలువ : రూ.333.43 కోట్లు
రైతుల వద్ద ఇంకా మిగిలిన పొగాకు : 65 నుంచి 68 మిలియన్ కిలోలు
ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 93,628 బేళ్లు కొనుగోలు చేశారు. వీటిలో వర్జీనియా పొగాకు 89,754 బేళ్లు, బ్లాక్ సాయిల్ పొగాకు 3,874 బేళ్లు ఉన్నాయి.