
యువకుడిని బలిగొన్న లారీ
పెరవలి: లారీ రూపంలో
రహదారిపై చీకట్లో పొంచి ఉన్న మృత్యువును ఆ యువకుడు గమనించలేకపోయాడు. ఫలితంగా రాంగ్ రూట్‌లో, హెడ్‌లైట్లు కూడా వేయకుండా దూసుకొచ్చిన లారీ అతడి ప్రాణాన్ని కబళించింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కుంపట్ల పెద వీరన్న(24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం కాకరపర్రులో పనికి వెళ్లి, రాత్రి 10.30 సమయంలో మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరిగి పయనమయ్యాడు. మార్గం మధ్యలో రహదారిపై ఓ లారీ హెడ్ లైట్లు వేయకుండా రాంగ్ రూట్‌లో ఆగి ఉంది. లైట్లు వేయకుండానే ఆకస్మికంగా ఆ లారీని ముందుకు దూసుకురావడంతో.. అటుగా మోటార్ బైక్‌పై వచ్చిన పెద వీరన్న అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి కుంపట్ల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.
యువతి ఆత్మహత్య
ఉప్పలగుప్తం: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్ రాజేష్ వివరాల మేరకు, ఎస్.యానం పెదపేటకు చెందిన మట్టా సునీత(24) ఆదివారం సాయంత్రం ఇంటి పక్కనున్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో మనస్తాపానికి గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తండ్రి నకులుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ తెలిపారు.