తల్లడిల్లుతున్న తల్లి పేగు | - | Sakshi
Sakshi News home page

తల్లడిల్లుతున్న తల్లి పేగు

May 28 2025 12:23 AM | Updated on May 28 2025 12:23 AM

తల్లడ

తల్లడిల్లుతున్న తల్లి పేగు

పి.గన్నవరం: గోదావరి పాయలో మంగళవారం సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి గల్లంతు కావడం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వీరిలో ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకైక సంతానం కాగా, మరొకరికి అక్క ఉంది. రెక్కాడితేనే గానీ డొక్కాడని ఆయా కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తారన్న కుమారులు నీట మునిగి గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన కేతా ప్రవీణ్‌ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన నీతిపూడి పౌలు కుమార్‌ (15), మరో ఇద్దరు విద్యార్థులు కలిసి సాయంత్రం వరకూ నాగుల్లంకలో ఆడుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో నాగుల్లంకకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలో వశిష్ట నదీపాయలో సరదాగా స్నానం చేసేందుకు సైకిళ్లపై వెళ్లారు. పెదలంకకు చెందిన నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి నెల రోజుల క్రితం పౌలుకుమార్‌ వచ్చాడు. నదీలో స్నానం చేస్తున్న ప్రవీణ్‌, సూర్యతేజ, పౌలుకుమార్‌లు నీట మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు బాలురు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరారయ్యారు. వారి వివరాలు తెలియ రాలేదు. ప్రమాద స్థలానికి సమీప లంకల్లో పని చేస్తున్న కూలీలు.. నీట మునుగుతున్న విద్యార్థులను గమనించి, అక్కడికి చేరుకునే సరికే వారు మునిగిపోయారు. విద్యార్థుల దుస్తుల్లో ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

నాగుల్లంకలో విషాద ఛాయలు

ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో నాగుల్లంక గ్రామంలో విషాయ ఛాయలు అలముకున్నాయి. కేతా ప్రవీణ్‌ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అతడి తండ్రి వెంకటేశ్వరరావు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సరోజిని గృహిణి. వీరి మొదటి కుమారుడు ఏడాది వయసులోనే మరణించడంతో రెండో కుమారుడైన ప్రవీణ్‌ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రవీణ్‌ గల్లంతు కావడంతో వారు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సానబోయిన సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి దుర్గాభవాని గృహిణి. వీరికి ఏకైక సంతానమైన సూర్యతేజ నీట మునిగి గల్లంతు కావడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పెదలంకకు చెందిన పౌలుకుమార్‌ నెల రోజుల క్రితం నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి వచ్చాడు.

ప్రమాద స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి మంగళవారం రాత్రి పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పి.గన్నవరం తహసీల్దార్‌ పి.శ్రీపల్లవి, సీఐ ఆర్‌.భీమరాజు, ఎస్సై బి.శివకృష్ణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వశిష్ట నదీపాయలో

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

మూడు కుటుంబాల్లోనూ

ఏకై క కుమారులే

తల్లడిల్లుతున్న తల్లి పేగు1
1/2

తల్లడిల్లుతున్న తల్లి పేగు

తల్లడిల్లుతున్న తల్లి పేగు2
2/2

తల్లడిల్లుతున్న తల్లి పేగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement