
రైస్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రైస్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కొత్త కార్డుతో పాటు కార్డు విభజన, సింగిల్ మెంబర్ స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పు, బియ్యం కార్డు సరెండర్ వంటి వాటికి అవకాశం ఉందన్నారు. ఈ సేవలు పొందటానికి ఎటువంటి కాలపరిమితీ విధించలేదనీ, నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
వరి విత్తనాలు సిద్ధం
రాజమహేంద్రవరం రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 73,812 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్న నేపథ్యంలో, దానికి అవసరమైన 36,906 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచామన్నారు. వీటిలో ప్రైవేటు డీలర్ల ద్వారా 3,690 క్వింటాళ్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. రైతు నుంచి రైతుకు 32,816 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించడానికి సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 400 క్వింటాళ్ల విత్తనాలను జూన్ మొదటి వారంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై అందిస్తామన్నారు.
జీవితంలో
యోగా భాగం కావాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మంగళవారం రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రితో పాటు కలెక్టర్ పి.ప్రశాంతి హాజరయ్యారు. సుమారు 1,300 మంది ఖైదీలు, 200 మంది కారాగార సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో యోగా ఆవశ్యకతను వివరిస్తూ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, యోగా సాధన నిరంతర ప్రక్రియ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్, గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్‌వీ శ్రీధర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, సెంట్రల్ జైలు అధికారులు బి.రత్నరాజు, ఆర్.శ్రీనివాసులు, జిల్లా ఆయుష్ వైద్యులు కె.రమేష్, సెంట్రల్ జైలు ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త పి.కేజియా, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో
కోవిడ్ వార్డు ఏర్పాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోవిడ్ వ్యాిప్తి నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమవుతున్నారు. ముందు జాగ్రత్తగా రాజమహేంద్రరం ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. ఈ వార్డులో పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. అవసరమైతే ఉపయోగించేందుకు వెంటిలేటర్‌ను అందుబాటులో ఉంచారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యాధి లక్షణాలను బట్టి అవసరమైతే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పూర్వపు క్యాంటీన్ ప్రాంతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ చర్యలు చేపట్దారు.

రైస్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం

రైస్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం