
కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే కడతేరిపోయాడు
ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పోషిస్తాడని అనుకుంటే చదువు పూర్తి కాకుండానే తన కుమారుడు కడతేరిపోయాడని ఆ తండ్రి తీవ్రంగా విలపించారు. గోదావరిలో గల్లంతై మృతి చెందిన తాతపూడి నితీష్ కుమార్ తండ్రి రాజును వారించడం అక్కడివారి వల్ల కాలేదు. తన కుమారుడు బీఎస్సీ యానిమేషన్ కోర్సు చదువుతూ, తనకు ఆసరాగా ఉంటున్నాడని, ఇటీవల ఆర్థిక పరిస్థితి బాగా లేక తాను ఫీజు కట్టలేనని చెప్పగా.. ‘డాడీ నా ఫీజు నేనే కట్టుకుంటాను’ అని చెప్పి ఈవెంట్లు చేసి తన ఫీజులు తానే కట్టుకుంటున్నాడని వాపోయారు. కుటుంబాన్ని ఆదుకుంటాడని, తన కుమార్తెలిద్దరికీ పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకున్నానని, అంతలోనే అర్ధాంతరంగా మృతి చెందాడని రోదించారు. ఇక్కడి ఫంక్షన్‌కు రాకుండా ఉంటే తన కొడుకు బతికి ఉండేవాడని విలపించారు.