బావురుమంటున్న బాధితులు
ముమ్మిడివరం మండలం కమిని వద్ద ఘటన
సోమవారం స్నానాలకు వెళ్లిన పదకొండు మందిలో 8 మంది గల్లంతు
ఏడుగురి మృతదేహాలు లభ్యం
గోదావరి పాయలలో విస్తృత గాలింపు
పాల్గొన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు
శుభ కార్యక్రమం నిర్వహించినవారి ఇంట విషాద ఛాయలు
సాక్షి, అమలాపురం/ ముమ్మిడివరం/ తాళ్లరేవు/ కాట్రేనికోన: గోదావరి తీరం శోక సంద్రంగా మారింది. గోదావరి ఒడిలో గల్లంతైన తమ బిడ్డలు ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారని తెల్లవార్లూ ఎదురుచూసిన ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర నిరాశే మిగిలింది. జిల్లా యంత్రాంగం మంగళవారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. యానాంకు చెందిన గజ ఈతగాళ్లు, పోలీస్ యంత్రాంగంతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆరు స్పీడ్ బోట్‌ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కొక్క యువకుడి మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.
కె.గంగవరం మండలం శేరిలంకలో స్నేహితుడి సోదరి ఓణీల ఫంక్షన్‌కు వెళ్లిన 8 మంది యువకులు సోమవారం గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. తమ బిడ్డల ఆచూకీ కోసం రాత్రంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసినా చివరకు వారు విగత జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయతీ శివారు ఎర్రగరువు గ్రామానికి చెందిన వడ్డి మహేష్(15) మృతదేహం తొలుత లభ్యమైంది. తరువాత కాకినాడ తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ (20), కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (15), మండపేట మండలం అర్తమూరుకు చెందిన కులపాక వీర వెంకట రోహిత్ (19), కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ కుమార్ (18), ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన వడ్డి రాజేష్ (18) మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాకినాడకు చెందిన పాస్టర్ కుమారుడు సబ్బతి క్రాంతి ఇమ్మానుయేల్ (19) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను అంబులెన్స్‌లో ఎప్పటికప్పుడు ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సాయిశృతి ఆధ్వర్యంలో డాక్టర్ నిఖిత, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ కౌశిక్ పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిస్థితిని రామచంద్రపురం డీఎస్పీ ఎం.రఘువీర్, అమలాపురం డీఎస్పీ టీఆర్‌ఎస్‌కే ప్రసాద్, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు మాధవి, డి.అఖిల సమీక్షించారు.
దురదృష్టకర ఘటన
శేరిలంక ఘటన చాలా దురదృష్టకరమైనదని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అన్నారు. 20 ఏళ్ల లోపు యువకులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. స్నేహితులు ఆటవిడుపుగా ఇక్కడకు వచ్చి ఈవిధంగా మృత్యువాత పడడం చాలా దురదృష్టకరమైన ఘటన అన్నారు. గోదావరి లోపలికి వెళ్లడం, ఈత రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వీరిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ, చింతలపాటి శ్రీనురాజు, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్, నాయకులు కోలా బాబ్జీ తదితరులున్నారు.
గురజనాపల్లిలో విషాద ఛాయలు
కరప: స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లి గల్లంతైన వారిలో తాతపూడి నితీష్ కుమార్(18)ది కరప మండలం గురజనాపల్లి గ్రామం. అతని తండ్రి ఆటోడ్రైవర్, తల్లి వరలక్ష్మి గృహిణి. వీరికి సుచిత్ర, భానులత ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నితీష్. కాకినాడలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ, కాకినాడ జగన్నాథపురంలోని ఒక చర్చిలో గిటారిస్ట్‌గా నితీష్ నైపుణ్యం సాధించాడు. అతడి అకాల మరణంతో గురజనాపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే నితీష్ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. నితీష్ గల్లంతైన విషయం తల్లి వరలక్ష్మికి తెలియనివ్వలేదు. శవపంచనామా తర్వాత గురజనాపల్లి తీసుకొచ్చిన కుమారుడి మృతదేహం చూసి ఆమె గుండెలవిసేలా విలపించింది. చదువుకుని ప్రయోజకుడు అవుతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆ తల్లి రోదనకు అక్కడివారు కన్నీటి పర్యంతమయ్యారు. తదనంతరం నితీష్ కుమార్ మృతదేహం వద్ద అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఖననం చేశారు.
అన్నయ్యా.. నాకు దిక్కెవరు
అన్నయ్యా.. నాకు దిక్కెవరంటూ గోదావరిలో గల్లంతైన కులపాక వీర వెంకట రోహిత్ చెల్లెలు బిందు మాధవి బోరున విలపించింది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రోహిత్ చెల్లెలి కోసం తన చదువును పదో తరగతిలోనే ముగించి, అర్తమూరులోని ఒక రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. బిందు మాధవి ఇంటర్మీడియెట్ చదువుతోంది. పెద్ద దిక్కు లేని వీరిద్దరూ పెద్దమ్మ, పెదనాన్నలైన నక్కా సుజాత, గోవిందరాజుల వద్ద పెరుగుతున్నారు. చెల్లెల్ని ఉన్నత చదువులు చదివించాలన్న కోరిక తీరకుండానే రోహిత్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో చెల్లెలు బిందు మాధవితో పాటు పెద్దమ్మ, పెదనాన్నలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
నిండా ఇరవై ఏళ్లు లేవు. ఇంకా నూనూగు మీసాలు రాలేదు. వారిలో కొందరికి ఈత రాదు. కానీ ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. అందరూ కలిసి గౌతమీ గోదావరిలో స్నానాలకు వెళ్లారు. గోదారి తల్లి వారిని నిర్దాక్షిణ్యంగా తనలో కలిపేసుకుంది. ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో స్నానాలకు వెళ్లి సోమవారం గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురు విగత జీవులై తేలారు. అన్నపానీయాలకు ఆలవాలమైన గోదారమ్మ తల్లికి మరేం కోపం వచ్చిందో తెలియదు కానీ... ఏడు కుటుంబాలకు గర్భశోకాన్ని మిగిల్చింది.
ఎవరి కోసం బతకాలి
‘ఇద్దరు కొడుకులనూ ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడు. ఇంక నేను ఎవరి కోసం బతకాలి?’ అంటూ సబ్బతి పాల్ అభిషేక్ మృతదేహాన్ని చూసి తండ్రి రమేష్ అలియాస్ రఘు గుండెలవిసేలా రోదించాడు. రమేష్‌కు పాల్ అభిషేక్, క్రాంతి ఇమ్మానుయేల్ ఇద్దరు కుమారులు. ఈ ఘటనలో గల్లంతైన పాల్ మృతదేహం లభ్యంకాగా ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి రమేష్ బోరున విలపించారు. ‘ఫంక్షన్‌కు వెళుతున్నాను డాడీ. డబ్బు కావాలి ఫోన్ పే చేయండి అని అడగగా పెద్ద కుమారుడు క్రాంతికి ఫోన్‌పే చేశాను. కానీ, చిన్న కుమారుడు పాల్‌తో చివరిసారిగా మాట్లాడలేకపోయాను’ అంటూ వాపోయారు. పెద్ద కుమారుడు ఆరడగుల ఆజానుబాహుడు కావడంతో పోలీస్ ట్రైనింగ్‌కి వెళితే సెలెక్ట్ అవుతావని ప్రోత్సహించేవాడినని, తన కుమారుల కోసం తన భార్య పండ్లు, తినుబండారాలు సిద్ధం చేసి ఉంచేదని, ఆమెకు ఏం చెప్పాలని అంటూ తల్లడిల్లిపోయారు. ఈత రాకున్నా వారు గోదావరిలో ఎందుకు దిగారో తెలియడం లేదన్నారు.
ఉన్నత చదువు చదువుతాడనుకున్నాను
‘మా కుమారుడు ఉన్నత చదువు చదివి ప్రయోజకుడవుతాడని కలలు కన్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది’ అంటూ కాకినాడ తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ తండ్రి ప్రసాద్ కంటతడి పెట్టుకున్నారు. తనకిద్దరు కుమారులని, పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేశాడని, రెండో కుమారుడైన సాయి మహేష్ ఒంగోలులో ఫిజియోథెరపీ కోర్సు చేస్తూ నీట్‌కు ప్రిపేర్ అవుదామనుకున్నాడని చెప్పారు. ‘ఉన్నత చదువులు చదువుతాడనుకున్నాను. పది రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. స్నేహితుని ఇంట శుభకార్యానికి వెళతానని చెప్పి వచ్చి గోదావరిలో కలిసిపోయాడు’ అంటూ విలపించారు.