
అర్జీల పరిష్కారంలో శ్రద్ధ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వ్యయప్రయాసల కోర్చి పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఆన్‌లైన్‌లో మీసేవ ద్వారా, 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడుతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ 163, పంచాయతీరాజ్ 19, పోలీస్ 11, ఇతర శాఖలకు చెందిన 55 అర్జీలను స్వీకరించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 40 ఫిర్యాదులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 40 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఎస్పీలు యంబీయం.మురళీకృష్ణ, ఏవీ.సుబ్బరాజు అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో అడిషనల్ ఎస్పీలు ఫిర్యాదులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్‌ఎస్‌కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.
జూన్‌లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన
రాజమహేంద్రవరం రూరల్: రూ.37 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటివారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం హుకుంపేటలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆకర్షణీయంగా, పుష్కర్ ఘాట్‌ను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బ్రిడ్జిలంకలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. కడియం నర్సరీల అందాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది తమ ఉద్దే శమన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా తీర్చిదిద్దుతామన్నారు. నిడదవోలును, కోట సత్తెమ్మ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటకులు రెండు మూడు రోజులు పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు వీలుగా టెంట్ సిటీలు,హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండువాలోగిళ్లను లీజుకు తీసుకొని గ్రామాల్లో గడిపేలా చర్యలు చేపట్టామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమష్టి విజయంగా భావిస్తున్నామన్నారు.

అర్జీల పరిష్కారంలో శ్రద్ధ

అర్జీల పరిష్కారంలో శ్రద్ధ