
ఆ జీవోను ఉపసంహరించుకోవాలి
● మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ
● ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ సీపీ నేతల మద్దతు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజాసేవలో ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎండీయూ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే చిన్ని ఆధ్వర్యంలో ఈ ధర్నా సాగింది. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ప్రతినెలా సక్రమంగా ఇంటింటికీ రేషన్ అందచేస్తున్న ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 9 వేల ఎండీయూ వాహనాలు, వారికొక అసిస్టెంట్ అంటే 18 వేల మంది, వారితో పాటు కుటుంబ సభ్యులు జీవనోపాధిని దెబ్బతీశారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నారు. కాని షిప్ వెళ్లిపోయింది, రైస్ వెళ్లిపోయింది. అదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. ఆరోపణలు నిరూపించుకోలేక ఎండీయూ వాహనదారుల మీద పెడుతున్నారన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పక్కదారి పడుతోందని ఆరోపించడం కూటమి ప్రభుత్వం చేతకాని తనమన్నారు. అదే నిజమైతే ఎండీయూ వాహనాలపై కేసులు పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మద్యం పాలనీని విచ్చలవిడిగా చేసి మద్యాన్ని డోర్ డెలివరి చేసే విధంగా తయారు చేశారన్నారు. రేషన్ బియ్యాన్ని సక్రమంగా ఇంటింటికీ అందిస్తున్న ఎండీయూ ఆపరేటర్లను తీసివేసి ఇంటింటికి మద్యాన్ని అందించే వారిని పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు.