
రోడ్డు ప్రమాదంపై మాజీ ఎంపీ భరత్‌రామ్ దిగ్భ్రాంతి
రాజమహేంద్రవరం సిటీ: గామన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లోడు లారీ బ్రేక్ కొట్టడంతో లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారన్నారు. పరిమితికి మించి ఇసుక లారీలలో తరలించడం వలన లారీలలో ఇసుక రోడ్ల మీద పడి రాజమహేంద్రవరం నగరం రూరల్ ప్రాంతాలలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయమే ధ్యేయంగా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెగబడుతున్నారని భరత్ రామ్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. గతంలో మూడు ఇసుక ర్యాంపులు ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఇసుక ర్యాంపులతో ప్రతీ రోజు వందలాది లారీలతో ఇసుకను తరలించి కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు.
డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాల వలన ధవళేశ్వరం ఆనకట్ట, రోడ్ కం రైల్వే బ్రిడ్జి, నాల్గవ (గామన్)బ్రిడ్జి మనుగడ ప్రమాదంలో పడిందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూటమి నాయకులు ఇసుక తవ్వకాలు ఆపడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా వలన సీతానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరం ప్రాంతాలలో వందలాదిమంది గాయాల పాలై మృత్యువాత పడుతున్నారన్నారు. ఇసుక లారీల వలన ప్రమాదానికి గురి మృతిచెందినప్పుడే సంఘటనలు బయటకు వస్తున్నాయని, గాయాల పాలైన సంఘటనలు బయటకు రావడం లేదన్నారు.