కౌలు డబ్బులు కూడా రావు
ఈ ఏడాది పొగాకు రైతులు నిండా మునిగారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. మార్కెట్లో గిట్టుబాటు ధర పలకడం లేదు. కొనుగోలుదారుల మధ్య పోటీ లేదు. వేలానికి తెచ్చిన బేళ్లలో సగం కూడా కొనడం లేదు. బేలు తీసుకు రావడానికి, కొనకపోతే తిరిగి తీసుకు వెళ్లడానికి రవాణా ఖర్చులు రూ.200 అవుతోంది. కిలో రూ.260 నుంచి 270 మధ్య కొంటున్నారు. ఈ ఏడాది ఎకరం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.2 లక్షలు, పెట్టుబడి బ్యారన్‌కు రూ.లక్ష చొప్పున అయ్యింది. అన్ని ఖర్చులూ కలిపి ఎకరం సాగుకు రూ.3 లక్షలైంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఇప్పుడొస్తున్న ధర ప్రకారం ఎకరాకు రూ.2.80 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఎకరాకు నష్టం కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేలు. నేను పదెకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులు కోలుకోవడం కష్టం.
– పసలపూడి సత్యనారాయణ,
కౌలు రైతు, బందపురం, దేవరపల్లి మండలం
లోగ్రేడు పొగాకు
వాసన చూడటం లేదు
మార్కెట్లో లోగ్రేడు పొగాకు వాసనే చూడటం లేదు. ఈ పొగాకు ఎక్కడిదక్కడే ఉంది. మంచి పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వేలానికి తీసుకు వచ్చిన బేళ్లు పూర్తిగా కొనడం లేదు. 10 బేళ్లు తెస్తే రెండు మూడు కొంటున్నారు. మిగిలినవి తిరస్కరిస్తున్నారు. రైతు మొరను పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. నేను ఎకరం రూ.60 వేల చొప్పున పదెకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. గత ఏడాది మార్కెట్లో కిలో రూ.410 పలకడంతో ఈ ఏడాది ఎక్కువ మంది కౌలుదారులు పొగాకు సాగు చేశారు. అంచనాకు మించి ఉత్పత్తి పెరగడంతో కొనుగోలుదారులు సిండికేట్ అయ్యారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
– శొంఠి వీర నాగేంద్ర,
కౌలు రైతు, బందపురం, దేవరపల్లి మండలం
ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం
ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉండదని, పరిమితికి మించి పంట వేయవద్దని సీజన్ ప్రారంభం కాక ముందు నుంచే రైతులకు చెబుతూనే ఉన్నాం. సాగు విస్తీర్ణం పెంచవద్దని అవగాహన సదస్సులు నిర్వహించాం. అయినప్పటికీ రైతులు నల్లరేగడి భూములు, బాడవ భూముల్లో అధిక విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం చేశారు. సెంటు భూమి కూడా లేనివారు అధిక ధరకు కౌలుకు తీసుకుని పంట వేశారు. ఫలితంగా అనుమతికి మించి సాగు జరిగింది. ఇదే సమయంలో మన పొగాకుకు పోటీనిచ్చే దేశాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ లేదు. బాడవ భూముల్లో పండించిన పొగాకు కొనుగోలుదారులు కొనడం లేదు. వేలానికి బేళ్లు తక్కువగా వస్తున్నాయి. పొగాకు మార్కెట్ డిమాండ్, సప్లయ్‌పై ఆధారపడి ఉంటుంది.
– పి.హేమస్మిత, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి
కౌలు డబ్బులు కూడా రావు
కౌలు డబ్బులు కూడా రావు


