
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో బుధవారం నిర్వహించ తలపెట్టిన జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా కలెక్టర్ మాధవీలత మంగళవారం ఈమేరకు ఒక ప్రకటనలో తెలిపారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియ చేస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు
రాజమహేంద్రవరం సిటీ: రోడ్ కం రైల్వే బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలోఆర్టీసీ బస్సుల రాకపోకలను దారి మళ్లించినట్లు రాజమహేంద్రవరం డిపో మేనేజర్ షేక్ షబ్నం మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి అక్టోబరు 26వ తేదీవరకూ ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిడ్జిపై నుంచి వచ్చే కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల బస్సులు ఈ నెల రోజులూ గామన్ బ్రిడ్జి, కాతేరు, కంబాల చెరువు మీదుగా రాజమహేంద్రవరం డిపోకు రాకపోకలు సాగిస్తాయన్నారు. తాడేపల్లి గూడెం, తణుకు, నిడదవోలు డిపోల బస్సులు విజ్జేశ్వరం బ్యారేజి, బొబ్బర్లంక, ధవళేశ్వరం, రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్‌స్టాండు మీదుగా రాజమహేంద్రవరం కాంప్లెక్సుకు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించి సహకరించాలన్నారు.
జనవరి 5 నాటికి
తుది ఓటర్ల జాబితా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిన రీవైజ్డ్ షెడ్యూల్‌కి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ పబ్లికేషన్, తుది ఓటరు జాబితా ప్రచురణ పూర్తి చేస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు. తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5వ తేదీ నాటికి ప్రచురించడం జరుగుతుందన్నారు. స్పెషల్ రేవైజ్డ్ సమ్మరీ, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎం.ముకేష్ కుమార్ మీనా మంగళవారం సాయంత్రం కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డీఆర్వో జి.నరసింహులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశంలో చర్చించి, వారు చేసిన సూచనలు పరిగణనలో తీసుకుంటామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నాటికి సమగ్ర నివేదికను ఫారం 1 నుంచి 8 వరకు తయారు చేసి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సప్లిమెంటరీ, సమగ్ర ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి అక్టోబర్ 10 నుంచి 26 వరకు పనులను పూర్తి చేయడంతో పాటు అక్టోబర్ 27న ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని, డిసెంబర్ 26 నాటికల్లా పరిష్కారం చేస్తామన్నారు. జవాబుదారీతనంతో కూడిన ఓటరు జాబితాను జనవరి ఒకటి 2024 నాటికి సిద్ధం చేసి సమర్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.