
ఓ హోటల్ వంటగదిలో తనిఖీ చేస్తున్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు తదితరులు
అమలాపురంలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంలో పరిశుభ్రత మార్గ దర్శకాలను పాటించని హోటళ్లు, స్వీటు దుకాణంపై జిల్లా ఆహార భద్రతా అధికారుల బృందం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాసరావు, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వి.రుక్కయ్య ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ తనిఖీల బృందంలో డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయం నుంచి డాక్టర్ ఎన్.సునీల్, ఎంపీహెచ్‌ఈవో ఎం.రామలింగేశ్వరరావు ఉన్నారు. తనిఖీలు చేసిన ఆరు హోటళ్లు, ఒక స్వీటు దుకాణానికి పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణాలతో మొత్తం రూ.36 వేలు జరిమానా విధించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని గ్రీన్ ట్రీ, విష్ణుశ్రీ, దుర్గాస్, బొండం బాబాయ్, ఆర్య, గణపతి హోటళ్లు, గణపతి స్వీట్ షాపులను అధికారులు తనిఖీ చేశారు. పలు హోటళ్లల్లో వంట పదార్థాల తయారీ గదుల్లో పరిశుభ్రత సరిగా లేకపోవడంపై ఆహార భద్రతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్పనాయుడుతో కలిసి మాట్లాడారు. నోటీసులకు వారం రోజులు గడువు ఇచ్చాం. హోటళ్ల యాజమానులు తాము తనిఖీల్లో గుర్తించిన లోపాలను ఆ గడువులోపు సరిదిద్దుకుంటే సరి. లేని పక్షంలో హోటళ్ల మూసివేతకు చర్యలు చేపట్టమని మున్సిపల్ అధికారులకు సూచించామని చెప్పారు.