
అనపర్తి: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో మూసివేసిన ఉత్తర కేబిన్ రైల్వే గేటు వద్ద మంగళవారం రైలు ఢీకొని స్థానికంగా మూడో తరగతి విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మార్కండేయపురంలో నివాసముంటున్న కె.గంగాధరరావు, భవాని దంపతుల కుమార్తె జాహ్నవి(8) స్థానికంగా గల ఓ ప్రైవేటు స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. మంగళవారం స్కూల్ వదిలిన తరువాత తన తాతతో ఇంటికి తిరిగి వస్తున్న జాహ్నవి రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వెళుతున్న సూపర్‌ఫాస్ట్ రైలును గమనించకుండా ట్రాకు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెందింది. వార్త తెలుసుకున్న స్థానికులు అధిక సంఖ్యలో రైల్వే గేటు వద్దకు చేరుకున్నారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.
రైలు ఢీకొని
గుర్తుతెలియని వ్యక్తి
మృతి.....
అనపర్తి ఐఎల్‌టీడీ ఫ్యాక్టరీ దాటిన తరువాత ఉన్న యార్డు వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు సామర్లకోట జీఆర్‌పి పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, 5.6 అంగుళాల ఎత్తు, ఒంటిపై తెలుపుపై నలుపు రంగు గళ్ల టీ షర్ట్, కాషాయరంగు పంచె ధరించి ఉన్నాడని తెలిపారు. అనపర్తి రైల్వే స్టేషన్ మాస్టర్ టి.కొండలరావు ఇచ్చిన సమాచారం మేరకు శవపంచనామా అనంతరం మృతదేహాన్ని అనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జీఆర్‌పీ ఎస్సై బి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు సామర్లకోట రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

జాహ్నవి (ఫైల్)