
గతేడాది జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్‌లో విద్యార్థుల ప్రదర్శన
● 31వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనకు సన్నాహం
● విద్యార్థులకు చక్కని అవకాశం
● పాఠశాలల నుంచి ప్రాజెక్టులకు ఆహ్వానం
● 29, 30 తేదీల్లో సైన్స్ టీచర్లకు జిల్లా స్థాయి ఓరియంటేషన్ తరగతులు
రాయవరం: నేటి బాలలే..భవిష్యత్ శాస్త్రవేత్తలు అవుతారన్నది అక్షర సత్యం. ఈ విషయాన్ని అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు నిరూపించారు. తన గురువు సుబ్రహ్మణ్యన్ అయ్యర్ చెప్పిన సైన్స్ పాఠం డాక్టర్ అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్‌గా మారడానికి కారణమైంది. అందుకే చిన్నారుల చిట్టి మెదళ్లలోని గట్టి ఆలోచనలకు పదును పెట్టి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక వేదికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. చిరుప్రాయం నుంచే చిన్నారుల్లో శాసీ్త్రయ ఆలోచనలు రేకెత్తించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయగా, రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్) ఆధ్వర్యంలో ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నారు. భారత శాస్త్ర సాంకేతిక విభాగం, రాష్ట్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి జిల్లా సైన్స్ కాంగ్రెస్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రాజెక్టులు సిద్ధం చేసుకోవాలిలా..
● జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శించే ప్రాజెక్టులు సైన్స్ సూత్రాలను ప్రదర్శించే నమూనాలుగా ఉండాలి. – విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు ప్రధాన అంశానికి లోబడి, ఏదేని ఉప అంశానికి చెంది ఉండాలి.
● ప్రాజెక్టు ద్వారా సమస్యకు నిర్ధిష్ట కాలంలో పరిష్కారాన్ని కనుగొనలేక పోయినప్పటికీ అధ్యయన పద్ధతి మాత్రం శాసీ్త్రయంగా ఉండాలి.
● సమస్య అవగాహన, సృజనాత్మకత, నూతనత్వానికి ప్రాధాన్యమివ్వాలి.
● ఇద్దరు విద్యార్థులు టీమ్‌గా ప్రాజెక్టు నిర్వహించాలి.
● చక్కని శీర్షికతో, సంబంధిత నిర్దేశిత భౌగోళిక ప్రాంత పరిధిలో ప్రాజెక్టు నిర్వహించాలి. పరిశీలనలను తేదీల వారీగా లాగ్‌బుక్‌లో నమోదు చేయాలి. దత్తాంశాలన్నింటినీ విశ్లేషించాలి.
● పరిశోధన ఫలితాన్ని వివరించాలి. వ్యాఖ్యానించాలి..సమస్యకు పరిష్కారాన్ని సూచించాలి. ప్రాజెక్టు మొత్తాన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంట్‌గా రూపొందించి పోటీల్లో సమర్పించాలి.
● 250 పదాలకు మించకుండా ప్రాజెక్టు సంక్షిప్తరూపం రాయాలి.
29, 30 తేదీల్లో డివిజన్ స్థాయిలో అవగాహన
ఈ నెల 29న రామచంద్రపురం డివిజన్, 30న అమలాపురం డివిజన్‌లో జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రాజెక్టుల తయారీ, విద్యార్థులను సన్నద్దం చేసేందుకు ఉపాధ్యాయులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రామచంద్రపురం డివిజన్ స్థాయి సమావేశం శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాల, అమలాపురం డివిజన్ స్థాయి అవగాహన సమావేశం అమలాపురం మండలం కామనగరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించేందుకు జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా సైన్స్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గిరజాల వెంకటసత్యసుబ్రహ్మణ్యం ఈ సమావేశాలకు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టుల తయారీలో సూచనలు, సలహాలకు అకడమిక్ కోఆర్డినేటర్‌గా పీవీ బ్రహ్మానందం వ్యవహరించనున్నారు.
దరఖాస్తు చేయాలిలా..
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో నమూనాలు ప్రదర్శించడానికి ఆయా పాఠశాలలు ముందుగానే ఆన్‌లైన్‌లో జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ గిరజాల వెంకటసత్య సుబ్రహ్మణ్యం(96401 88525)కు దరఖాస్తు చేసుకోవాలి.
సైన్స్ టీచర్ల మార్గదర్శకత్వం
ప్రతి పాఠశాల నుంచి కనీసం రెండు నుంచి మూడు ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి. ప్రాజెక్టులు రూపొందించే విద్యార్థులకు సైన్స్ టీచర్లే గైడ్ టీచర్లుగా వ్యవహరిస్తారు.
గిరజాల వెంకటసత్యసుబ్రహ్మణ్యం,
జిల్లా కోఆర్డినేటర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, అమలాపురం.
ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ప్రాతినిధ్యం
జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలకు ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో హెచ్‌ఎంలు, సైన్స్ ఉపాధ్యాయులదే ప్రధాన బాధ్యత.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం
ఐదు విభాగాల్లో పోటీలు
జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అన్ని యాజమాన్యాల పరిధిలోని 6–12 తరగతుల విద్యార్థులు 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2023లో పాల్గొనేందుకు అర్హులు. పాఠశాలలకు వెళ్లే వారితో పాటు 10 నుంచి 17 ఏళ్ల లోపు బడి మానేసిన వారూ ఇందులో పాల్గొనవచ్చు. జిల్లా స్థాయి వరకు 10–17 ఏళ్ల లోపు వారు పోటీల్లో పాల్గొనవచ్చు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 10 నుంచి 14 ఏళ్ల లోపైతే జూనియర్లుగా, 14 నుంచి 17 ఏళ్ల లోపు వారిని సీనియర్లుగా విభజించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలు సిద్ధం చేయించాలన్నదే జిల్లా సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశం. జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శన తేదీని త్వరలో తెలియజేస్తారు.
ఇవీ ప్రధాన, ఉప ప్రధాన అంశాలు
ఈ ఏడాది ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్ధం చేసుకోవడాన్ని ప్రధాన అంశంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది.
మీ పర్యావరణ వ్యవస్థను తెలుసుకోండి.
ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సును పెంపొందించడం.
పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సామాజిక, సాంస్కృతిక పద్ధతులు.
స్వీయ ఆధారితం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానం.
పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణలు ఉప అంశాలుగా తీసుకోవాలి.
విద్యార్థులు ఈ ఐదు ఉప అంశాల్లో నమూనాలు సిద్ధం చేసుకోవచ్చు.

రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఎంబ్లమ్

