రవిశంకర్‌తో ఊర్మిళ వివాహేతర సంబంధం.. భర్తను చంపేసి.. | - | Sakshi
Sakshi News home page

రవిశంకర్‌తో ఊర్మిళ వివాహేతర సంబంధం.. భర్తను చంపేసి..

May 6 2023 12:14 PM | Updated on May 6 2023 12:39 PM

- - Sakshi

గజానంద్‌ భార్య ఊర్మిళకు రవిశంకర్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

తూర్పు గోదావరి: వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కక్షతో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఉదంతమిది. ఈ కేసు వివరాలను పి.గన్నవరం సీఐ డి.ప్రశాంతకుమార్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రాయుడు రవిశంకర్‌ తల్లి ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఆ సమయంలో మృతుడు గజానంద్‌ బోడ్కర్‌ ఆమె కారు డ్రైవర్‌గా పని చేశాడు. కరోనాకు ముందు మసాలా వ్యాపారం నిర్వహించిన రవిశంకర్‌.. అది గిట్టుబాటు కాకపోవడంతో స్వగ్రామం గంగలకుర్రు అగ్రహారం వచ్చేశాడు.

స్థానికంగా వర్మి కంపోస్ట్‌ యూనిట్‌ ఏర్పాటు చేశాడు. తనకు సహకరించేందుకు గజానంద్‌ బోడ్కర్‌, ఊర్మిళ దంపతులను ఆదిలాబాద్‌ నుంచి రప్పించి, అమలాపురం మండలం బండారులంక మెట్ల కాలనీలో నివాసం ఏర్పాటు చేశాడు. వర్మి కంపోస్ట్‌ యూనిట్‌లో కూడా నష్టాలు రావడంతో రవిశంకర్‌.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటారు సైకిళ్ల విడిభాగాల వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో గజానంద్‌ భార్య ఊర్మిళకు రవిశంకర్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డం వస్తున్నాడనే కక్షతో ఊర్మిళ భర్త గజానంద్‌ను గత ఏడాది నవంబర్‌ 23న పథకం ప్రకారం వర్మి కంపోస్ట్‌ షెడ్డులో కొట్టి చంపేశారు.

అతడి మృతదేహాన్ని వర్మి కంపోస్టు యూనిట్‌లోనే దాచి పెట్టారు. ఇదిలా ఉండగా గంగలకుర్రు అగ్రహారంలో పనికి వెళ్లిన తన కుమారుడు కనిపించడం లేదంటూ గజానంద్‌ తండ్రి శివాజీ గత జనవరిలో హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు కోసం అక్కడి పోలీసులు అంబాజీపేట వచ్చారు. అనంతరం నాలుగు రోజుల క్రితం ఈ కేసును అఫ్జల్‌గంజ్‌ నుంచి అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వెంటనే ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ కె.వెంకట రమణ పర్యవేక్షణలో సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, ఎస్సై ఎ.చైతన్యకుమార్‌ ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

సీఐ, ఎస్సైలు శుక్రవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. అనుమానం రావడంతో వర్మి కంపోస్ట్‌ యూనిట్‌ వద్ద తవ్వించారు. అక్కడ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గజానంద్‌ అస్తిపంజరం లభించింది. ఈ కేసులో హతుడి భార్య ఊర్మిళ, ఆమె ప్రియుడు రవిశంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా నాలుగు రోజుల్లో ఛేదించిన సీఐ ప్రశాంత్‌కుమార్‌, ఎస్సై చైతన్యకుమార్‌, క్రైం పార్టీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement