లో
సోమవారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2026
కొడుకును పెంచడం కంటే నాలుగు కొబ్బరి చెట్లను పెంచుకోవడం మేలన్నది కోనసీమ సామెత. 20 ఏళ్ల పాటు పెంచిన కొడుకు ఆదరించకపోయినా నాలుగు కొబ్బరి చెట్లు ఎన్నో విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటాయి. కొబ్బరి చెట్టు కోసం తలలు తెగిపడిన ఘటనలెన్నో. కొడుకంటి కొబ్బరి చెట్టుకు నేడు కష్టకాలం వచ్చింది. వరుస తుపాన్లు కొబ్బరి చెట్ల తలలను నరికి ఆ రైతులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. మరీ గట్టిగా చెప్పాలంటే అర్నబ్ చేసిన గాయానికి ఆరేళ్ల వరకు దిగుబడి రాదని కొబ్బరి రైతు తల పట్టుకుని కూర్చున్నాడు. దిగుబడి ఇచ్చినా ఇవ్వకపోయినా కొబ్బరి చెట్టు పోషణ మాత్రం తప్పని సరి. దిగుబడి వచ్చే వరకు ఏటా వేలకు వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా నెలకొంది.
ఐ.పోలవరం/అయినవిల్లి: ఏడాది పొడవునా ఆదాయమిచ్చే కొబ్బరి చెట్లు.. ఇప్పుడు రైతులకు భారంగా మారాయి. తుపాను గాలులకు విరిగిన మొవ్వులు.. మెలి తిరిగిన చెట్ల పైభాగాలు.. నేలకొరిగిన వృక్షాలు.. రైతుల ఆశలను చిదిమేశాయి. అర్నబ్ తుపాను వెళ్లిపోయినా కొబ్బరి తోటల్లో మిగిల్చిన గాయం మాత్రం మానడం లేదు. ఒకవైపు దిగుబడి సగానికి పైగా పడిపోయే పరిస్థితి.. మరో వైపు దెబ్బతిన్న చెట్లను శుభ్రం చేయడానికి, పడిపోయిన వాటిని తొలగించడానికి వేల రూపాయల ఖర్చు. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాన్నిచ్చే చెట్లే ఇప్పుడు అదనపు పెట్టుబడి కోరుతున్నాయి. కాయలు కాయకపోయినా ఎరువులు వేయాలి.. చెట్లను బాగు చేయాలి.. తోటను శుభ్రం చేయాలి. చేతికి ఆదాయం రాకముందే జేబు ఖాళీ అవుతోంది. రెండేళ్ల వరకు సాధారణ దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో కోనసీమ కొబ్బరి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
తోటలపై తీవ్ర ప్రభావం
జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. అత్యధికంగా సాగు జరిగే రకం ఈస్ట్‌కోస్ట్ టాల్. అర్నబ్ తుపాను దాటికి సుమారు 10 శాతం చెట్లు పూర్తిగా నేలకొరిగిపోగా.. మరో 40 శాతం చెట్ల మొవ్వులు, పై భాగాలు దెబ్బతిన్నాయి. కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, అమలాపురం ప్రాంతాల్లో ఎకరాకు 10 నుంచి 15 చెట్ల వరకు మొవ్వులు విరిగిపోయాయి. తీర ప్రాంత మండలాలైన ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి తీర ప్రాంతాల్లో ఎకరాకు 25 నుంచి 30 చెట్ల వరకు దెబ్బతిన్నాయి. తోటల్లో ఎటుచూసినా విరిగిన మొవ్వులు, మెలితిరిగిన చెట్లే కనిపిస్తున్నాయి.
ఆదాయం ప్రశ్నార్థకం
సాధారణంగా ఎకరాకు 60 చెట్లు ఉంటే ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి 90 కాయల చొప్పున 5,400 కాయలు వస్తాయి. కాయ సగటు ధర రూ.20 అనుకుంటే ఏడాదికి రూ.1.08 లక్షలు, రెండేళ్లకు రూ.2.16 లక్షల స్థూల ఆదాయం వస్తుంది. ఇప్పుడు దిగుబడి పడిపోవడంతో ఈ ఆదాయానికి గండి పడుతోంది. సాగు ఖర్చులు, ఎరువులు, ఇతర యాజమాన్య ఖర్చులు పోను రైతుకు మిగిలేది ఇంకా తక్కువ. ఆదాయం తగ్గినా చెట్ల సంరక్షణకు పెట్టుబడి మాత్రం కొనసాగించాల్సి వస్తోంది.
శుభ్రతకే రూ.7 వేల భారం
విరిగిన మొవ్వులు, ఆకులు, డొలకులు, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మొవ్వుల కోతకు రూ.150 నుంచి రూ.200, వ్యర్థాల తొలగింపునకు మరో రూ.వెయ్యి వరకు ఖర్చవుతోంది. ఖర్చు భారీగా అవుతున్న కూడా మొవ్వు నరికే కార్మికులు లేక రైతులు మరీంత ఇబ్బంది పడుతున్నారు. డెల్టాలో ఎగువన ఉన్న మండలాల్లో మొత్తం శుభ్రం చేసే పనులకు ఎకరాకు రూ.3,150 నుంచి రూ.5,200 వరకు అవుతోంది. అదే తీర ప్రాంతాల్లో రూ.4,650 నుంచి రూ.7,200 వరకు వ్యయమవుతోందని రైతులు వాపోతున్నారు. ఎరువులు, మందులు, తదుపరి యాజమాన్య ఖర్చులు దీనికి అదనం.
8
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు
ఎరువులు, మొక్కలు, వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటలకు నాణ్యమైన నాటే యంత్ర సామగ్రి అందించాలని, కొబ్బరి వంటి వాణిజ్య పంటలకు దిగుబడి ఆధారిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక కొబ్బరి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న చెట్ల పునరుద్ధరణ, తోటల శుభ్రతకు వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఆదుకోకపోతే కొబ్బరి సాగును కొనసాగించడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా విరిగిన మొవ్వులు..
తలలు తెగిన చెట్లు
తుపాను మిగిల్చిన గాయాలకు
రెండేళ్లయినా కోలుకోలేని పరిస్థితి
రానున్న ఆరు నెలలూ సగమే దిగుబడి
చెట్ల శుభ్రత, వ్యర్థాల తొలగింపునకే
ఎకరాకు వేలల్లో ఖర్చు
ఆదాయం తగ్గినా.. పెట్టుబడి మామూలే
కుంగిపోతున్న కొబ్బరి రైతులు
సగానికి పైగా దిగుబడి నష్టం
సాధారణంగా ఒక్కో చెట్టుకు నెలకు ఒక పొత్తు చొప్పున వస్తోంది. ఒక్కో పొత్తుకు కనిష్ఠంగా 15 నుంచి 20 కాయల దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం దెబ్బతిన్న చెట్ల నుంచి వచ్చే కొత్త పొత్తులకు ఎనిమిది కాయలు కూడా వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే ఆరు నెలల్లో దిగుబడి 50 శాతానికి పైగా తగ్గుతుందని అంచనా. తిరిగి సాధారణ దిగుబడి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని చెబుతున్నారు.


