సాక్షి, రాజమహేంద్రవరం: కొండలు కరిగిపోతున్నాయి.. ప్రకృతి సంపద కొల్లగొట్టుకుపోతున్నారు. మరో వైపు ప్రజల ప్రాణాలకూ ముప్పు తప్పని పరిస్థితి. పట్టపగలే భారీ యంత్రాలతో వందలాది లారీలతో సాగుతున్న గ్రావెల్ దందా. రాజానగరం నియోజకవర్గంలోని కొండగుంటూరులో అధికార పార్టీ నేతల అండతో కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్ దోపిడీకి గురవుతోంది. వారం రోజులుగా తవ్వకాలు నిరంతరంగా సాగుతున్నా గనుల శాఖ కనీసం ఆ వైపు చూడడం లేదు. అదేమని అడిగే ప్రజల ప్రశ్నలకు అధికారుల మౌనం ఆందోళనలకు గురిచేస్తోంది.
రహదారి ధ్వంసమై నరక యాతన
కొండల నుంచి గ్రావెల్ తరలించేందుకు భారీ లారీలను నిరంతరం వినియోగిస్తుండటంతో కేశవరం–బొమ్మూరు రహదారి పూర్తిగా దెబ్బతింటోంది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ధ్వంసమవడమే కాకుండా గ్రావెల్ రోడ్డుపై పేరుకుపోయి వర్షం వచ్చినపుడు బురదమయమై ప్రమాదాలకు కారణమవుతోంది.
నిద్రమత్తులో మైనింగ్ శాఖ అధికారులు
జిల్లాలో గనుల శాఖ ఉందా? ఉంటే ఏం చేస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను తరలిస్తున్నా పట్టించుకోరు. పత్రికల్లో వార్తలు ప్రచురితమైనపుడు హడావిడి చేయడం.. ఒకటో రెండో బోట్లను సీజ్ చేసి ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులపై చర్యలు శూన్యం
కొండగుంటూరులో గ్రావెల్ తవ్వకాలపై సంబంధిత మైనింగ్ అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తవ్వకాలు ఆగడం లేదు. అందిన ఫిర్యాదులపై కనీసం క్షేత్రస్థాయికి వెళ్లి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? లేవా? అనుమతులు ఉంటే వాటి పరిధి ఎంత? అనే అంశాలపై తనిఖీలు చేయకుండా మౌనం వహించడంలో వారి ఆంతర్యమేమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఫిర్యాదులపై స్పందించక పోవడానికి కారణామేమిటి? అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయా లేక మరేదైనా వ్యవహారం నడుస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ..
సెలవు రోజులు వచ్చాయంటే గ్రావెల్ మాఫియా మరింత చెలరేగిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో భారీ యంత్రాలను రంగంలోకి దించి పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ రోజుల్లో కార్యాలయాలు మూసి ఉండటం, ఫిర్యాదు చేసినా తక్షణ స్పందన ఉండదనే ధీమాతోనే అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఆదివారం కూడా కొండగుంటూరులో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి వందలాది లారీల్లో గ్రావెల్ తరలించడం గమనార్హం. మరుసటి రోజు అధికారులు వచ్చేలోపు తవ్వకాలు నిలిపివేసి ఏమీ జరగనట్లు వ్యవహరించే వ్యూహం అమలు చేస్తున్నారు స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి మైనింగ్ శాఖలోని కొందరు అధకారులే ఇలాంటి సలహాలు ఇస్తున్నారని బహిరంగంగా కొందరు చెబుతున్నారు. ఇటువంటి వారిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కొండ పోయి గుంటూరు మిగిలేలా..
కొండగుంటూరులో భారీ తవ్వకాలు
అధికార అండతో గుల్లవుతున్న కొండలు
అనుమతుల్లేకుండా లారీల్లో తరలింపు
నిత్యం రూ.కోట్లలో సాగుతున్న దందా
సెలవు రోజుల్లో మరింతగా తవ్వకాలు
ఫిర్యాదులకు స్పందించని అధికారులు
ప్రకృతి సంపదకు కొరవడిన రక్షణ
కొండలు, గుట్టలు, నదులు ప్రకృతి ఇచ్చిన సంపద. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. కానీ కొందరి స్వార్థం కోసం ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతుంటే సంబంధిత శాఖలు ప్రేక్షక పాత్ర వహించడం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఒకవైపు, ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండి మరోవైపు, ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు ఇంకోవైపు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, మైనింగ్ ఉన్నతాధికారులు స్పందించాలి. కొండగుంటూరులో తక్షణమే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు పరిశీలించాలి. అక్రమాలు నిజమని తేలితే యంత్రాలు, వాహనాలను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ పలుకుబడి ఎంతటి వారిదైనా చట్టం ముందు నిలబెట్టాలి. లేకపోతే రేపటికి అక్కడ కొండలు మిగులుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొండగుంటూరులో అక్రమ తవ్వకాల విషయాన్ని మైనింగ్ శాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తే... ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని, సోమవారం సిబ్బందిని పంపించి పరిశీలిస్తామని చెబుతుండడం గమనార్హం.
కొండగుంటూరులో వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండను భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొండ అంచులను తొలిచి, గ్రావెల్‌ను భారీ లారీల్లో తరలిస్తున్నారు. ఒకప్పుడు ఎత్తుగా కనిపించిన కొండ ఇప్పుడు రహదారి స్థాయికి సమతలంగా మారుతోందంటే తవ్వకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రోజుకు కనీసం 300 లారీల్లో.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని లే అవుట్లు, అపార్టుమెంట్లు నిర్మిస్తున్న బిల్డర్లకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీకి రూ.30 వేలకు పైగా వసూలు చేస్తున్నా కనీసం రూ.కోటికి పైగానే దందా సాగుతోంది. ఈ తవ్వకాలకు కనీస అనుమతులు లేకపోవడం గమనార్హం.
అధికార అండతో..
ఈ అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా బలంగా వినిపిస్తోంది. కొండగుంటూరు చుట్టుపక్కల మూడు నియోజకవర్గాలకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా ఇంత దందా సాగడం అసాధ్యమని స్థానికులు అంటున్నారు. మరోవైపు అక్రమ తవ్వకాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో తవ్వకాలు చేయిస్తున్న వారు తమకు అధికార పార్టీ నేతల అండ ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న రీతిలో దూకుడుగా, బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.


