నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

సర్పంచ్‌ స్థానాలకు 100.. వార్డులకు 216 నామినేషన్ల్లు

అమలాపురం రూరల్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో సోమవారం కలెక్టరేట్‌, డివిజన్‌, మండల కేంద్రాల్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు గమనించాలని సూచించారు.

20న జిల్లా స్థాయి

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

అమలాపురం రూరల్‌: జిల్లాలో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌– 2026 జిల్లా స్థాయి కార్యక్రమాన్ని 20న ఉదయం 9 గంటలకు అమలాపురం మండలం వన్నెచింతలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్‌కే మహబూబ్‌ బాషా తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రాజెక్టు బృందాలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని పాఠశాలల విద్యార్థులు తమ సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అమలాపురం రూరల్‌: అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 100, వార్డు సభ్యుల స్థానాలకు 216 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం.శాంతలక్ష్మి వెల్లడించారు. ఇందులో అత్యధికంగా అమలాపురం మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 19, అల్లవరం మండలంలో 16, రాజోలు మండలంలో 15, ఐ.పోలవరం మండలంలో 12, కాట్రేనికోన మండలంలో 8, మలికిపురం మండలంలో 6, మామిడికుదురు మండలంలో 6, సఖినేటిపల్లి మండలంలో 10, ఉప్పలగుప్తం మండలంలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అమలాపురం మండలం ఇందుపల్లిలో నామినేషన్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ ఈసీఓ వసంతమాధవి పరిశీలించారు.

రత్నగిరిని దర్శించి.. తరించి

అన్నవరం: రత్నగిరిపై ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. ఆలయాన్ని తెల్లవారుజాము 3 గంటలకు తెరిచి దర్శనాలకు అనుమతించడంతో పాటు వ్రతాలు ప్రారంభించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించగా, 5,300 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తూర్పు రాజగోపురం ముందు రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. కార్తిక తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

సెలవు రోజున

స్టాంపుల విక్రయం

కాకినాడ లీగల్‌: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో స్టాంపుల విక్రయాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. స్టాంప్‌ వెండర్ల నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు విక్రయించరాదని చెబుతున్నప్పటికీ, ఆదివారం ఒక స్టాంప్‌ వెండర్‌ రూ.20 విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులను విక్రయించారు. ఈ స్టాంపులపై ముద్రించిన తేదీకి, స్టాంప్‌ వెండర్‌ విక్రయాల రిజిస్టర్‌లో నమోదు చేసిన తేదీకి మధ్య వ్యత్యాసం ఉండటం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. 14వ తేదీన సర్వర్‌ సమస్య తలెత్తడంతో స్టాంపుల విక్రయాలు జరగలేదు. దీంతో కాకినాడ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్ల కోసం అవసరమైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఒక స్టాంప్‌ వెండర్‌ స్టాంపుల విక్రయాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం కొనుగోలు చేసిన స్టాంప్‌ పేపర్లపై నవంబర్‌ 15వ తేదీ ముద్రించి ఉండగా, స్టాంప్‌ వెండర్‌ విక్రయాల పుస్తకంలో మాత్రం నవంబర్‌ 14వ తేదీగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement