● తొలి చైర్‌పర్సన్‌గా ఆమెకే చాన్స్
● జనరల్ అవుతుందని
ఆశావహుల అంచనాలు
● మున్సిపాలిటీల నుంచి పంచాయతీలకు
ఓట్లు మార్చుకున్న నేతలు
● రిజర్వేషన్‌తో జెడ్పీ రేసు నుంచి
పలువురికి తప్పని నిష్క్రమణ
సాక్షి, అమలాపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆశావహుల అంచనాలు తలకిందులయ్యాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి తమకే దక్కుతుందన్న ఆశతో రాజకీయంగా పావులు కదిపిన నేతలకు రిజర్వేషన్లు గట్టి షాక్ ఇచ్చాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలి నుంచీ ఈ పదవి జనరల్ కేటగిరీకి వస్తుందన్న అంచనాతో జెడ్పీ పీఠంపై కన్ను వేసిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. పదవి దక్కించుకునేందుకు ముందస్తు కసరత్తు చేసిన నేతలకు రిజర్వేషన్ల ఖరారు చివరకు నిరాశనే మిగిల్చింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ నుంచి విడిపోయి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన కోనసీమకు తొలి జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలతో ఏర్పడిన ఈ జిల్లా పరిషత్‌కు తొలి చైర్‌పర్సన్ పదవి ఎవరిని వరిస్తుందన్న అంశంపై కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీకి అవకాశం ఉంటుందన్న అంచనాలు బలంగా వినిపించాయి. దీనినే నమ్ముకున్న పలువురు ఆశావహులు జెడ్పీ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని, రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో వారి లెక్కలన్నీ తారుమారయ్యాయి.
ఓట్లు మార్చుకుని.. ఆశలు పెంచుకుని..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి జనరల్ అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో కొందరు నాయకులు తమ ఓటు హక్కును సైతం మార్చుకున్నారు. అమలాపురం పట్టణ పరిధిలో ఓటు హక్కు కలిగిన పలువురు నేతలు గ్రామ పంచాయతీలకు తమ ఓట్లను బదిలీ చేసుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు, ఆ పార్టీ యువ నాయకుడు చెరుకూరి సాయిరాం వంటి వారు అమలాపురం పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఓట్లు మార్చుకున్న వారిలో ఉన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి జనరల్ అయితే పోటీకి దిగవచ్చన్న ఆలోచనతో వీరు అడుగులు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. తీరా ఇప్పుడు చైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వీరి రాజకీయ వ్యూహాలకు బ్రేక్ పడినట్లయింది. తాము ఆశించిన పదవికి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జెడ్పీ పీఠంపై పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రకటనకు ముందే ఓటు హక్కు మార్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న నేతలకు తాజా రిజర్వేషన్లు శరాఘాతంగా పరిణమించాయి. ఎంతో ముందుచూపుతో వేసిన అడుగులు చివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది.
మున్సిపాలిటీ జనరల్
మరోవైపు అమలాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పట్టణ పరిధిలో రాజకీయ భవిష్యత్తును ఆశించిన నాయకులకు మున్సిపల్ చైర్మన్ పదవి ఒక అవకాశంగా కనిపిస్తున్నప్పటికీ, జెడ్పీ పీఠంపై దృష్టి సారించిన వారికి మాత్రం తాజా రిజర్వేషన్లు నిరాశ కలిగించాయి. జిల్లా పరిషత్ పదవి జనరల్ అవుతుందన్న నమ్మకంతో గ్రామీణ ప్రాంతాలకు ఓట్లు మార్చుకున్న వారు.. ఇప్పుడు మున్సిపాలిటీ జనరల్ రిజర్వేషన్ కావడం చూసి లబోదిబోమంటున్నారు.


