రేషన్ డీలర్ల ఆవేదన
అమలాపురం రూరల్: తమకు ప్రస్తుతం అందుతున్న కమీషన్ నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డిపోల అద్దె, విద్యుత్ బిల్లులు ఇతర ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు. కోనసీమ జిల్లా రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దారు వాసా దివాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలోనూ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బియ్యం బస్తాలపై ఉన్న కోడ్‌లను స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వినియోగదారుల ఫోన్ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కూడా సమస్యగా మారిందని వివరించారు. ఈ విధానాల వల్ల రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఒక్క రూపాయి చొప్పున అందుతున్న కమీషన్‌ను రూ.4 నుంచి రూ.5కు పెంచాలని కోరారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, తగిన గౌరవ వేతనం కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘ గౌరవ అధ్యక్షురాలు నడింపల్లి అన్నపూర్ణ, మాజీ అధ్యక్షుడు మలిశెట్టి నాగేశ్వరరావు, నేతలు అరిగెల సుబ్రహ్మణ్యం (బాబ్జి), మోటూరి సత్యనారాయణ, పీవీ సత్యనారాయణ, సోమనాథం, కాసిన సుబ్రహ్మణ్యం, సుగ్గు సత్యనారాయణ, కాసిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


