అమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా పి.వసంత మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డివిజనల్ అభివృద్ధి అధికారిగా ఉన్న ఆమె కాకినాడ జిల్లాలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సేవలను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉపసంహరించి తాజా నియామక ఉత్తర్వులు ఇచ్చారు. కోనసీమ జిల్లా తొలి సీఈవోగా నియమితులైన వసంత మాధవి కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్‌కుమార్‌ను మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అమలాపురం మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.
రిజర్వేషన్ల ఖరారులో
పారదర్శకత పాటించాలి
– అధికారులకు కలెక్టర్ ఆదేశం
అమలాపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, డేటా పరిశీలన, ఎన్నికల ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై జిల్లా కలెక్టర్, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆర్డీవోలు పర్యవేక్షణ చేయనున్నట్టు చెప్పారు. వార్డులు, స్థానాల వారీగా రిజర్వేషన్ల కసరత్తును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి జిల్లా గెజిట్‌లో ప్రచురించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గెజిట్ కాపీలను క్రోడీకరించి రాత్రి 9 గంటల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించాలని చెప్పారు. ఎన్నికల సంసిద్ధత నివేదికను కూడా నిర్దేశిత సమయంలోగా అందజేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పింక్, వైట్ బ్యాలెట్ పేపర్లు, చెరిగిపోని సిరా, గ్రీన్ పేపర్ సీల్స్, సంబంధిత ఫారాలు తదితర సామగ్రి లభ్యతను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. సమావేశంలో జేసీ వైఖోం నైడియా దేవి, డీఆర్‌వో వి.సుబ్బారావు, ఆర్డీవోలు కె.సరళాదేవి, జీవీవీ సత్యనారాయణ, డీపీవో శాంతికుమారి, మున్సిపల్ కమిషనర్లు ఎం.నిర్మల్ కుమార్ రామరాజు, ఆర్‌ఆర్ రాజు పాల్గొన్నారు.


