– ఆందోళన చేసి అడ్డుకున్న గ్రామస్తులు
కాజులూరు: మండలంలోని పల్లిపాలెంలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. గ్రామంలో టేకి డ్రెయిన్ గట్టును ఆనుకుని ఉన్న మట్టిదిబ్బలను అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు అక్రమార్కులు అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లపై యానాం ప్రైవేటు లే అవుట్‌లకు మట్టి తరలిస్తుండటం గమనార్హం. కాసులకు కక్కుర్తిపడి స్థానిక అధికారులు ఈ మట్టి అక్రమ తవ్వకాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో మట్టి వ్యాపారం జోరుగా సాగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. పొలాల నుంచి జనావాసాల మీదుగా ట్రాక్టర్లు, లారీలతో మట్టి రవాణా జోరుగా సాగుతుండటంతో విలువైన రహదారులు ధ్వంసమౌతున్నామని, పలుచోట్ల రోడ్డుపై తిరిగే చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వివరించారు. దీంతో తప్పనిసరై తామే ఆందోళన బాట పట్టామని వెల్లడించారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులు నిలుపుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే.. అధికారులు, నాయకుల ఆదేశాల మేరకే తాము మట్టి తవ్వకాలు చేస్తున్నామని నిర్వాహకులు ఆందోళనకారులపై ఎదురుదాడికి దిగారు. అనుమతులు ఉంటే పత్రాలు చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేయడంతో నిర్వాహకులు మిన్నకుండిపోయారు. అనుమతులు లేకుంటే పనులు తక్షణం నిలుపుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో నిర్వాహకులు మట్టి తవ్వకం పనులు నిలిపివేశారు.


