నోటిఫికేషన్ కోసం నిరీక్షణ
స్థానిక ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది? రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది? ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండనుంది? అన్న అంశాలపై రాజకీయ నాయకులు, ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు పల్లెల్లో మద్దతు కూడగట్టుకోవడం, పట్టణాల్లో తమ బలాన్ని అంచనా వేసుకోవడం, పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరపడం వంటి కార్యక్రమాలతో స్థానిక రాజకీయాలు మరింత సందడిగా మారనున్నాయి.
● రిజర్వేషన్లు, నోటిఫికేషన్ కోసం
ఎదురుచూపులు
● సుప్రీంకోర్టు తీర్పుతో
స్థానిక ఎన్నికలపై పెరిగిన ఆసక్తి
● పల్లెలు, పట్టణాల్లో మొదలైన
రాజకీయ చర్చలు
● వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్మన్ సీటు
వరకు ఆశావహుల లెక్కలు
సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లాకు ఎన్నికల సెగ తగిలింది. ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామాల్లో వీధివీధినా, కూడళ్లలో, పట్టణాల్లో స్థానిక ఎన్నికల గురించే చర్చ సాగుతోంది. ఎక్కడ చూసినా ఎవరు బరిలోకి దిగుతారు? ఏ వార్డు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? సర్పంచ్ పదవి ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుంది? ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పులొస్తాయి? నేరుగా జరిగే మున్సిపల్ చైర్మన్ పదవికి బరిలో ఎవరుంటారు అనే రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇప్పుడు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుల నుంచి పట్టణ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారి వరకు తమకు అవకాశాల కోసం ఆరా తీస్తున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత రావడం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడమే తరువాయి అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారుతోంది.
సుప్రీంకోర్టు సూచనలతో పెరిగిన ఉత్కంఠ
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసి ఎన్నికల నిర్వహణకు సూచనలు చేయడంతో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఖరారవుతాయి? ఏ స్థానాలు తమకు అనుకూలంగా మారతాయి? అనే అంశాలపై ఆశావహులు దృష్టి సారించారు. అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, రాజకీయంగా మాత్రం కదలికలు మొదలయ్యాయి. తమకు పరిచయాలు ఉన్న నాయకులను కలవడం, పార్టీ పెద్దలతో మాట్లాడటం, స్థానికంగా మద్దతు కూడగట్టుకోవడం వంటి ప్రయత్నాలు సాగుతున్నాయి.
పల్లెల్లో మొదలైన సందడి
కోనసీమ జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు, 3,878 పంచాయతీ వార్డులు ఉండటంతో గ్రామస్థాయిలో ఎన్నికల ప్రభావం విస్తృతంగా ఉండనుంది. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలపై కూడా ఆశావహులు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసినవారు, ఈసారి కొత్తగా బరిలోకి దిగాలని భావిస్తున్నవారు తమ అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రామాల్లో సామాజిక సమీకరణాలు, స్థానికంగా ఉన్న పరిచయాలు, ప్రజలతో సంబంధాలు, పార్టీ మద్దతు వంటి అంశాలపై చర్చలు సాగుతున్నాయి. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
పట్టణాల్లోనూ రాజకీయ వేడి
జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలోనూ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. చైర్మన్ ఎన్నిక నేరుగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. కొత్తగా పెరిగిన 11 వార్డులతో కలిపి మొత్తం 95 వార్డులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో వార్డుల సంఖ్య, రిజర్వేషన్ల ఖరారు కీలకం కానున్నాయి. పట్టణాల్లోని స్థానిక నాయకులు వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఏ వర్గానికి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా కొలిక్కి వస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లపై ఆసక్తి నెలకొంది.
జెడ్పీ పీఠం వరకూ లెక్కలే
ఎన్నికల సందడి గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. 19 మండల పరిషత్‌లు, 19 జెడ్పీటీసీ స్థానాలు, 430 ఎంపీటీసీ స్థానాలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పైనా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్నది ఆశావహులకు కీలకంగా మారింది. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తున్నవారు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందన్న అంచనాతో పార్టీ నాయకుల వద్దకు వెళ్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై ఆశావహుల లెక్కలు
ప్రభుత్వం ప్రకటించిన శాతాల ఆధారంగా అంచనా స్థానాలు ఇవీ..
పదవి / స్థానాలు రిజర్వేషన్ కోనసీమ అంచనా స్థానాలు
శాతం జిల్లాలో (సుమారు)
మున్సిపల్ చైర్మన్ 33.02 3 1
పట్టణ వార్డులు 32.78 95 31
సర్పంచులు 27.95 342 96
పంచాయతీ వార్డులు 26.73 3,878 1,037
ఎంపీటీసీలు 25.55 430 110
జెడ్పీటీసీలు 24.60 19 5
ఎంపీపీలు 24.60 19 5


