● దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్
● మందపల్లి క్షేత్రంలో పనుల పరిశీలన
● రూ.120 కోట్లతో 542 పనులకు ప్రతిపాదనలు
● రూ.117 కోట్లతో 484 పనుల ప్రారంభం
కొత్తపేట: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన దేవాలయాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా వేగవంతం చేయాలని దేవదాయ – ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జిల్లాలోని పుష్కర పనుల పరిశీలనలో భాగంగా ఆయన ఆర్‌జేసీ వేండ్ర త్రినాథరావుతో కలిసి శనివారం మండలంలోని మందపల్లిలో శనైశ్చర క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్షేత్రంలో రూ.4.2 కోట్లతో చేపట్టిన తైలాభిషేక మండపాలు, అన్నదాన భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి లోపు పనులు పూర్తయ్యేలా వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి తీరానికి ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న దేవాలయాలన్నింటినీ అవసరం మేరకు అభివృద్ధి, ఆయా క్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.120 కోట్లతో 542 పనులకు ప్రతిపాదించామని వాటిలో 484 పనులకు రూ.117 కోట్లు మంజూరు చేశామన్నారు. సుమారు 50 మేజరు పనులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయన్నారు. మైనర్ పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. పనులన్నీ రానున్న ఏప్రిల్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కమిషనర్‌కు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు తదితరులు స్వాగతం పలకగా వేద పండితులు వేదాశీస్సులు అందజేశారు. కమిషనర్ వెంట సాంకేతిక సలహాదారు సుబ్బారావు, ఎస్‌ఈ దుర్గేశ్ కుమార్, డీఈ ఉదయ్ కుమార్, డిప్యూటీ స్థపతి సతీష్ ఉన్నారు. దేవస్థానం మాజీ చైర్మన్ చింతం విజయ కృష్ణ మోహన్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సిద్ధంశెట్టి వీవీ సత్యనారాయణ, స్థానిక నాయకులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
నాణ్యత లేకుంటే సహించేది లేదు
కాట్రేనికోన: మండలంలోని కుండలేశ్వరుని సన్నిధిలో రూ.2.5 కోట్లతో చేపడుతున్న అన్నదాన, వసతి భవన సముదాయాలను దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆర్‌జేసీ త్రినాథరావుతో కలసి పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలిచ్చారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు.


