మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ
కాజులూరు: బీసీలపై కూటమి నేతలు కపట ప్రేమను చూపుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి నేతలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ప్రకటన అంతా బూటకమన్నారు. 2020 పంచాయతీరాజ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ప్రతాప్‌రెడ్డితో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చెయ్యడానికి వీలులేదంటూ కోర్టులో పిల్ వేయించారన్నారు. కోర్టు తీర్పును అనుసరిస్తూనే అప్పటి ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరంగా 34 శాతానికి తగ్గకుండా బీసీలకు సీట్లు కల్పించారన్నారు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్‌కు చట్టసవరణ చేయించాలన్నారు. అంతేతప్ప రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించడం, వారే కోర్టులో కేసులు వేయించడం కూటమి నేతలకు సరికాదన్నారు. బీసీలను చంద్రబాబు ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు.
25వ రోజుకు వీఆర్‌ఏల సమ్మె
ఆత్రేయపురం : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన సమ్మె 25వ రోజైన శనివారం కూడా కొనసాగింది. చాలీచాలని జీతాలతో, పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలతో జీవితాలు వెళ్లబుచ్చడం కష్టంగా ఉందని, వెంటనే జీతాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్రేయపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన శిబిరంలో వీఆర్‌ఏల సంఘ నేతలు లోవరాజు, ప్రసాద్, ఎలిజిబెత్, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
‘తూర్పు’లో పులి కలకలం
చాగల్లు: తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి ప్రజలను హడలెత్తిస్తోంది. రోజుకో చోట ప్రత్యక్షమవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతు న్నారు. రెండు రోజులుగా దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల పరిధిలోని పలు గ్రామాల మీదుగా సంచరించిన పెద్ద పులి శనివారం తిరిగి చాగల్లు శివారు ప్రాంతానికి చేరుకుంది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


