మేత దరువు.. మరోసారి | - | Sakshi
Sakshi News home page

మేత దరువు.. మరోసారి

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

సాక్షి, అమలాపురం: ఆక్వా సాగులో పెట్టుబడి భారాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం రైతులకు ఊరట కల్పించడం లేదు. ఒకవైపు సాగు ఖర్చులు పెరుగుతుండగా.. మరోవైపు రొయ్యల మేత కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. తాజాగా మరోసారి టన్నుకు రూ.11 వేల వరకు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయన్న సమాచారంతో ఆక్వా రైతుల్లో ఆందోళన మొదలైంది. ధరల పెంపు మధ్య 40 రోజుల వ్యవధి ఉండాలనే నిబంధనను.. సాగు సమ్మె చేస్తామనే రైతులు హెచ్చరికలను పెడచెవిన పెట్టి మరీ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

ధరాభారం రూ.562.60 కోట్లు!

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సుమారు 23 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతున్నట్టు అంచనా. అనధికారికంగా మరో ఐదారు వేల ఎకరాల్లోనూ సాగు జరుగుతోంది. ఏడాదికి మూడు, నాలుగు పంటలు కలిపి సగటున 75 వేల ఎకరాలకు సరిపడా సుమారు 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత వినియోగమవుతోందని రైతులు చెబుతున్నారు. మేత ధరల్లో స్వల్ప పెరుగుదల వచ్చినా ఉత్పత్తి వ్యయంపై భారీ ప్రభావం పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతిపాదిత ధర కూడా పెరిగితే జిల్లాల వారీగా వినియోగం, ధరల పెంపును పరిగణనలోకి తీసుకుంటే మొత్తం భారం సుమారు రూ.562.50 కోట్లకు చేరినట్టు వారి అంచనా.

మాట ఒకటి.. పెంపు మరొకటి

ఈ ఏడాది జూన్‌లో వనామీ మేత ధర టన్నుకు రూ.10 వేలు, టైగర్‌ రొయ్యల మేత టన్నుకు రూ.12 వేల చొప్పున పెంచారు. గత నెలలో మరోసారి వనామీ మేతపై రూ.8 వేలు, టైగర్‌ మేతపై రూ.10 వేల పెంపునకు కంపెనీలు సిద్ధపడటంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా), మత్స్యశాఖ, ఆక్వా రైతులు, మేత కంపెనీల ప్రతినిధులు ధరల పెంపుపై చర్చలు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కంపెనీలు మరోసారి భారీగా ధరలు పెంచేయడం గమనార్హం. కేవలం ప్రభుత్వ వత్తాసుతోనే మేత కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వనామీ మేత టన్నుకు రూ.5700 పెంచుతున్నట్లు కంపెనీలు లేఖలు పంపాయి. అమలు సమయానికి ధరను మరింత పెంచాయి. ఆ తర్వాత కొంతమేర తగ్గించినప్పటికీ, తాజాగా మరో రూ.11 వేల పెంపునకు సన్నాహాలు జరుగుతుండటంతో నాలుగు నెలల్లో టన్నుకు రూ.27 వేల వరకు అదనపు భారం పడినట్టవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు ఉన్నా.. అమలేది?

మేత ధరల పెంపునకు కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలనే నిబంధనను కంపెనీలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఽఇటీవల కోనసీమ జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ఆక్వా రైతులు సెప్టెంబరు 30లోగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అవసరమైతే సాగు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.

ధరలు తగ్గించకుంటే సాగు విరామమే

రొయ్యల మేత ధరలను తగ్గించకుంటే ఆక్వా సాగు చేయలేం. ఇప్పటికే పలుమార్లు ధరలు పెంచిన కంపెనీలు మరోసారి ధరను భారీగా పెంచడం దారుణం. ఇప్పటికే రొయ్యల చెరువుల నిర్వహణ భారం కావడంతో పాటు రొయ్యకు సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. భారీగా పెరిగిన ధరలతో సాగు చేయడం చాలా కష్టం. ప్రభుత్వం మేత ధరలు తగ్గించకుంటే సాగును విరమించాల్సిందే.

– మేడిశెట్టి శ్రీనివాస్‌, వనామీ రైతు,

పి.మల్లవరం, తాళ్లరేవు మండలం

రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు

రైతు, రైతు సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా మేత కంపెనీలు ధరలు పెంచడం దారుణం. రైతు పండించిన పంటకు మద్దతు ధర నిర్ణయించే పరిస్థితి లేకపోయినా మేత తయారీదారులకు మాత్రం ధరలు నిర్ణయించుకునే వెలుసుబాటు ఉంది. ఇప్పటికే కంపెనీలు భారీగా ధరలు పెంచాయి. మళ్లీ పెంచితే తీవ్ర నష్టం జరుగుతుంది.

– నంద్యాల చంటి, ఆక్వా రైతు, చెయ్యేరు, కాట్రేనికోన మండలం

మేతకే అధిక పెట్టుబడి

రొయ్యల సాగులో మేతకే అత్యధిక ఖర్చు అవుతోంది. ఇప్పటికే ధరలు పలుమార్లు పెరగడంతో పెట్టుబడి భారాన్ని భరించలేకపోతున్నాం. మళ్లీ టన్నుకు రూ.11 వేలు పెంచితే సాగు కొనసాగించడం కష్టమవుతుంది. ధరల పెంపుపై ప్రభుత్వం జోక్యం చేసుకుని నియంత్రణ చర్యలు చేపట్టాలి.

– జంపన బుజ్జిరాజు, ఆక్వా రైతు, సఖినేటిపల్లి

టన్నుకు రూ.11 వేలు పెంచేందుకు

కంపెనీలు సిద్ధం

అదే జరిగితే 4 నెలల్లో టన్నుకు

రూ.27 వేల వరకు పెంపు

గత 2 నెలల్లోనే భారీగా పెరిగిన

వనామీ మేత ధరలు

రైతులపై రూ.562.50 కోట్ల

అదనపు భారం

కోనసీమ, కాకినాడ జిల్లాల్లో

23 వేల ఎకరాల్లో వనామీ సాగు

ధరల నియంత్రణకు చర్యలు

లేకపోవడంపై ఆక్వా రైతుల ఆగ్రహం

డిమాండ్లు పరిష్కరించకుంటే

సాగు సమ్మెకు దిగుతామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement