చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్‌లో ఏపీ అంతర్ జిల్లా బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించిన పోటీల్లో 17 జిల్లాల క్రీడాకారులు హాజరైనట్లు పోటీల నిర్వాహకుడు, నాలుగు జిల్లాల నల్లమల జోన్ ఇన్‌చార్జి నూతలపాటి దేవదాసు తెలిపారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులలో నిర్వహించిన పోటీల్లో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. పోటీల్లో ఎన్‌టీఆర్ జిల్లా జట్టు 2–1 తేడాతో తూర్పు గోదావరి జట్టుపై గెలవగా, కాకినాడ జిల్లా జట్టు 2–1 తేడాతో శ్రీకాకుళం జట్టుపై గెలిచింది. అలాగే కృష్ణాజిల్లా, అంబేడ్కర్ కోనసీమ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోటీలను ఆర్గనైజర్ నూతలపాటి దేవదాసు, నూతలపాటి విజయ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు.


