అమలాపురం రూరల్: వేగ నియంత్రణ పరికరం అమర్చకుండా తిరుగుతున్న మహదేవ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును రహదారి భద్రత ఉల్లంఘన నేరంకింద సీజ్ చేసి రూ.31,700 అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ట్రావెల్స్ బస్సు జీపీఎస్ ద్వారా సెంట్రల్ సర్వర్‌తో అనుసంధానమై ఉంటుందని, 80 కిలోమీటర్ల వేగ పరిమితి మించి ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని డీటీఓ హెచ్చరించారు. డ్రైవర్ల తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటికి యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని డీటీవో పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు సురేష్ కుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు.
3 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
అమలాపురం టౌన్: స్థానిక వనచర్లవారి వీధికి చెందిన ధరణికోట బిందు వెంకట సాయి రాహుల్ 3 కిలోల గంజాయితో పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. విశాఖ అటవీ ప్రాంతం నుంచి గంజాయిని అమలాపురానికి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయించేందుకు రాహుల్‌తో పాటు మరో ఇద్దరు ప్రయత్నిస్తుండగా పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో ఎస్సై కేఎం జోషి అతడిని శుక్రవారం అదుపులో తీసుకుని అరెస్టు చేసి సరకును సీజ్ చేశారు. నిందితుడిని అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించగా నిందితుణ్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ వివరించారు.
కంటైనర్ ఢీకొని వృద్ధుడి మృతి
కొత్తపేట: స్థానిక పలివెల వంతెన సమీపంలో కంటైనర్ లారీ ఢీకొని వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల మేరకు మారుతీ సెంటర్ ప్రాంతానికి చెందిన గాదిరాజు సూర్యనారాయణ (74) తన ఇంటి నుంచి ఖండ్రిగ వెళ్తుండగా పలివెల వంతెన సమీపంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కుమారుడు, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆయన బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


