● అవినీతిని నియోజకవర్గం
నుంచి జిల్లాకు విస్తరించారు
● 3 నెలల్లోనే ముక్కలైన ఇందుపల్లి–గరువు రోడ్డు
● లిక్కర్ వ్యాపారుల నుంచి
మామూళ్లూ వసూలు
● అవినీతి, అక్రమాలను
ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా?
● అవినీతిపై విచారణకు
ఎమ్మెల్యే బండారు సిద్ధమేనా?
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ధ్వజం
ఆలమూరు: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన అవినీతి, అక్రమాల సామ్రాజ్యాన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి విస్తరించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. మండలంలోని జొన్నాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమలాపురం రూరల్ మండలంలోని ఇందుపల్లి–గరువు రోడ్డులో గల తన షోరూమ్ గోడౌన్‌కు రూ.3.20 కోట్లతో తన అనుయాయుల కాంట్రాక్టుతో నిర్మించిన బీటీ రోడ్డు మూడు నెలలకే ముక్కలైందన్నారు. ఆ రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఆత్రేయపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన ఇటీవల నిర్మించిన రోడ్డు కూడా నాణ్యతా లోపంతో ఛిద్రమైందన్నారు. నాణ్యతా లోపాలపై ఎమ్మెల్యే బండారు విచారణకు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ముక్కామల నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు కుంగిపోతున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండారు అవినీతి సొమ్ముతో అమలాపురం, మలికిపురంలో రూ.కోట్ల విలువైన స్థలాన్ని సేకరించి షోరూమ్, గోడౌన్ నిర్మించిన సంగతి ప్రజలు మరువరన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే బండారు తన తప్పును తెలుసుకుని లోపాలను సరిదిద్దుకోవాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ తరపున పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో నిర్మించిన వకుళమాత భవనం, వసంతవాడలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తమ హయాంలోనే మంజూరైందని, అందులో కూటమి గొప్పదనమేమీ లేదని జగ్గిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే బండారు అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి సంస్కారం ఉంది కాబట్టే ఎమ్మెల్యే బండారు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం లేదన్నారు. అనంతరం ఇందుపల్లి రోడ్డులో జరిగిన అవినీతి వల్ల దెబ్బతిన్న వార్తా కథనాలను పార్టీ శ్రేణులతో కలసి ఆయన ప్రదర్శించారు.
కూటమి నేతలే కస్సుమంటున్నారు
మద్యం వ్యాపారుల నుంచి ముడుపుల పేరిట అక్రమార్జన చేస్తూ వ్యక్తిగత స్వలాభం కోసం సొంత కార్యకర్తలనే మోసగిస్తున్న ఎమ్మెల్యే బండారుపై ఆ కూటమి నేతలే కస్సుమంటున్నారని జగ్గిరెడ్డి తెలిపారు. బండారుపై వైఎస్సార్‌సీపీకి బురద చల్లే అవసరం లేదని, ఆయనే బురదలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని చెప్పారు. జనసేన పార్టీ ప్రాపకంతోనే ఎమ్మెల్యే అయిన సంగతిని మర్చిపోవద్దన్నారు. అదనపు ధరల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తేనే మద్యాన్ని ఎంఆర్‌పీ ధరలకు విక్రయిస్తున్నారన్నారు. జిల్లాలో రైతుల తరపున పోరాడినప్పటికీ సక్రమంగా సాగునీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. విధానపరమైన నిర్ణయాలపైనే తమ పార్టీ పోరాడుతుందని, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీపై లేనిపోని అరోపణలు చేస్తే తగిన సమయంలో బుద్ధి చెబుతామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొలుగూరి సూర్రెడ్డి, మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు పాల్గొన్నారు.


