అమలాపురం టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం శాతం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించకుండా కేవలం జీవో విడుదల చేసి రాష్ట్రంలోని బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కోర్టుల్లో వేసే కేసులు నిలబడవని చంద్రబాబుకు ముందే తెలిసినా కపట నాటకం ఆడారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయడంతో స్థానిక మున్సిపల్ పార్కు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు తీరుపై నిరసన తెలిపారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆ విగ్రహం వద్ద బీసీల ఐక్యత కోసం నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీల పట్ల చూపించే కపట ప్రేమను ఎండగట్టారు. తొలి నుంచి బీసీలను మోసం చేస్తున్న చంద్రబాబు బీసీల ద్రోహి అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు అన్నారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిన బీసీల పక్షపాతి వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నేతలు కుడుపూడి భరత్ భూషణ్, ముంగర ప్రసాద్, కముజు రమణ, కట్టోజు సన్నయ్యదాసు, కుడుపూడి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు


