సాక్షి, అమలాపురం: జీతాలు చెల్లించండి మహాప్రభో అంటూ జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్, సీపీడబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని శాఖల్లోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో, వారందరూ రోడ్డున పడి ఆకలి కేకలు పెడుతున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు, వాటిలో పని చేసే కార్మికులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నెలల తరబడి జీతాలు బకాయి పెడుతోంది.
నెలల తరబడి బకాయి
జిల్లాలోని 32 రక్షిత మంచినీటి సరఫరా పథకాల్లో సుమారు 250 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరికి ప్రతి నెలా కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలి. కానీ బిల్లులు విడుదల కాలేదనే సాకుతో కాంట్రాక్టర్లు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పి.గన్నవరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలోని పలు స్కీముల్లో పని చేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికి 6 నుంచి 11 నెలలుగా జీతాలు బకాయి పెట్టారు. ముఖ్యంగా పి.గన్నవరం సబ్ డివిజన్‌లోని మాచవరం స్కీమ్‌లో 11 నెలలుగా, రామచంద్రపురం సబ్ డివిజన్‌లోని దంగేరు స్కీమ్‌లో 7 నెలలుగా జీతాలు చెల్లించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేసి, కుటుంబాలను పోషించుకుంటున్నామని, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక నానా కష్టాలూ పడుతున్నామని వారు వాపోతున్నారు. అనారోగ్యాల బారిన పడితే అప్పుల కోసం తాము పడుతున్న బాధలు వర్ణనాతీతమని వాపోతున్నారు. తమ వేతనాలను బకాయిలు సహా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 5 నుంచి జిల్లాలోని 32 రక్షిత మంచినీటి పథకాలను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు యూనియన్ నాయకులు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు ఇప్పటికే వినతిపత్రం సమర్పించారు.
అమలుకు నోచని నిబంధనలు
నిబంధనల ప్రకారం ఎస్‌ఎస్‌ఆర్ కేటగిరీ–3 ప్రకారం రూ.19 వేల నుంచి రూ.24 వేల వరకూ వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.15,500, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.14,500 మాత్రమే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సదుపాయాలు కూడా అమలు చేయడం లేదు. ఇస్తున్న వేతనమే తక్కువ కాగా, అది కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీరు వాపోతున్నారు.
పరిపాలన
ఆమోదం ఉంటేనే జీతాలు
ఇదిలా ఉండగా విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ కార్యాలయంలో కాంట్రాక్టర్లు, ఉద్యోగ సంఘాలతో శనివారం చర్చలు జరిగాయి. అంతకుముందు అమలాపురంలో డీఈఈ రాజన్‌తో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు శుక్రవారం చర్చించారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, 2026–27 సంవత్సరానికి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోవాలని, అప్పటి వరకూ జీతాలు ఇవ్వలేమని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీలోపు సమస్య పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరగా, 15వ తేదీ వరకూ డీఈఈ సమయం కోరారు. ఈ సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమకు జీతాలు, పాత బకాయిలు ఎప్పుడిస్తారో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.
ఫ ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టు
ఉద్యోగుల ఆకలి కేకలు
ఫ జిల్లాలో 250 మంది కార్మికులు
ఫ ఒక్కొక్కరికి 6 నుంచి
11 నెలల వేతనాలు బకాయి
ఫ 5లోగా చెల్లించకపోతే 32
పథకాలు బంద్ చేస్తామని హెచ్చరిక
జీతాలు చెల్లించాలి
ఆర్‌డబ్ల్యూఎస్ ప్రాజెక్టుల్లో 27 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలివ్వడం లేదు. కాంట్రాక్టర్లు సక్రమంగా జీతాలివ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్ విధానంలో ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్ రేటులో 20 శాతం మినహాయించి జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో, రూ.14,500 నుంచి రూ.15,500 వరకూ మాత్రమే వస్తోంది. వెంటనే జీతాలు చెల్లించాలి.
– నాగిరెడ్డి పోశయ్య, ఆర్‌డబ్ల్యూఎస్,
సీబీడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా శాఖలో చాలా నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మేం ఆకలితో అలమటిస్తున్నాం. అప్పులు చేసి బతుకుతున్నాం. కాంట్రాక్టర్లలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి, మా జీతాలు పెంచి, సక్రమంగా చెల్లించాలి. ఒక రోజు నీటి సరఫరా ఆపితే ప్రజలు, అధికారులు ఇబ్బంది పడతారు. మాకు పవన్ కల్యాణే న్యాయం చేయాలి.
– చిట్టూరి శ్రీనివాసరావు,
ఆర్‌డబ్ల్యూఎస్, సీబీడబ్ల్యూఎస్ కాంట్రాక్టు
ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


