మామిడికుదురు: జిల్లాలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అధికారులను ఆదేశించారు. అప్పనపల్లి కాజ్‌వే వద్ద వరద పరిస్థితిని ఆదివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు పరిస్థితులు, నీటి ప్రవాహం, రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు విషమిస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. నీటి మట్టం పెరుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. తాగునీరు, విద్యుత్, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ప్రత్యేక సహాయం అందించాలని చెప్పారు. అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రాంతాల్లో అనవసర రాకపోకలు నివారించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సీఎస్ రాజు, ఎంపీడీవో జి.భవాని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


