కిక్కిరిసిన విఘ్నేశ్వర ఆలయం | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన విఘ్నేశ్వర ఆలయం

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత, లఘున్యాస అభిషేకాల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు గరిక పూజ, నలుగురు ఉండ్రాళ్ల పూజ, 61 మంది లక్ష్మీగణపతి హోమం నిర్వహించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణం, ఒకరికి అన్నప్రాశన, తులాభారం నిర్వహించారు. నూతన వాహనాలకు పూజలు జరిపారు. అన్నప్రసాదం 2,885 మంది భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద విరాళాలు, ప్రసాదాలు, పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.3,74,580 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, సహాయ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

కొబ్బరి కార్మికులకు

గుర్తింపు కార్డులివ్వాలి

రాజోలు: కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులకు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందజేయాలని రాష్ట్ర కొబ్బరి దింపు, ఒలుపు కార్మిక సంఘ అధ్యక్షుడు బొడ్డపల్లి నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ గంధం చంద్రుడును విజయవాడలో కలసి కొబ్బరి కార్మికుల సమస్యలపై ఆయన వినతిపత్రం అందజేశారు. రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో ఏర్పాటు చేస్తున్న కొబ్బరి బోర్డులో కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులను విలీనం చేసి, ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. 50 ఏళ్ల వయస్సు నిండిన కొబ్బరి కార్మికులకు పింఛన్‌ అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొనుగుపాటి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

‘పింగళి’ ఆశయాలు ఆదర్శం

అమలాపురం టౌన్‌: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయమని కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయ ణ అన్నారు. కోనసీమ రచయితల సంఘం, పి.గన్నవరం మమతా స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఆదివారం జరిగిన పింగళి వెంకయ్య జయంతి సభలో ఆయన మాట్లాడారు. శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, విశ్రాంత డీఐఈవో వనుము సోమశేఖరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మమతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ జాన్‌, దివ్యాంగుల మహా సంఘటన్‌ అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్‌, గ్రంథాలయ అసిస్టెంట్‌ పోలిశెట్టి సత్యనారాయణ, కవులు, రచయితలు పాల్గొని, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు.

యానాంలో..

యానాం: సమాచార శాఖ ఆధ్వర్యాన ఆదివారం పింగళి వెంకయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫెర్రీ రోడ్డులోని ఆ మహనీయుని విగ్రహానికి యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్‌మీనా, సీఐ డి.సురేష్‌బాబు, ఎస్సై కుమరన్‌ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నేడు పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవిన్యూ క్లినిక్‌ కార్యక్రమాలు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథాతథంగా జరగనున్నాయి. కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, ఇతర వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement