పైల్‌తోనే రైల్‌ పరుగులు | - | Sakshi
Sakshi News home page

పైల్‌తోనే రైల్‌ పరుగులు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

మలికిపురం: వశిష్ట గోదావరి నదిపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 30 ఏళ్ల క్రితం జాతీయ రహదారి వంతెన నిర్మాణంలో తలెత్తిన ఇబ్బంది వల్ల అదనపు పిల్లర్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణానికి సైతం అదనపు పిల్లర్‌ నిర్మాణం తప్పడం లేదు. కోటిపల్లి–నర్సాపురం రైల్వేలైన్‌లో భాగంగా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల దిండి–చించినాడ మధ్య నదిపై నిర్మితమవుతున్న రైల్వే వంతెనలో భాగంగా ఆఖరి పిల్లర్‌ నదిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఈ ఘటనతో చివరి దశలో ఉన్న నిర్మాణం నిలిచిపోయింది. నిర్మాణ సంస్థలు రైల్వే ఉన్నతాధికారులకు పరిస్థితిని నివేదించడంతో కొత్త డిజైన్‌కు శ్రీకారం చుట్టారు. దిండి వైపు లూజ్‌ సాయిల్‌ ఉంది. పిల్లర్‌ 20 మీటర్ల లోతుకు వెళ్లాక మడ్‌ బ్లో అవుట్‌ వల్ల ఒరిగిపోయింది. సాధారణంగా 50 మీటర్ల లోతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని, అటువంటి సమయంలో పిల్లర్‌ ఒరిగిపోయే ప్రమాదం ఉండదని, కానీ పైనే మడ్‌ బ్లో అవుట్‌ సంభవించడం వల్ల పిల్లర్‌ ఒరిగిపోయిందని రైల్వే ఇంజినీర్లు చెబుతున్నారు. తాజా పరిస్థితిని అధ్యయనం చేసిన ఇంజినీర్లు డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఒరిగిన పిల్లర్‌ను అలాగే వదిలేసి అటు, ఇటు రెండు పిల్లర్లు నిర్మించాలని నిర్ణయించారు. అది కూడా ఇంతకు ముందు పిల్లర్లకు వాడిన కర్బ్‌ ఫౌండేషన్‌ విధానంలో కాకుండా ఈ రెండు పిల్లర్లను పైల్‌ ఫౌండేషన్‌ విధానంలో నిర్మించాలని నిర్ణయించారు. లూజ్‌ సాయిల్‌ ఉన్న ప్రాంతాలలో నిర్దేశించిన పిల్లర్‌ స్థానంలో తొలుత భూమిలో 50 మీటర్ల వరకూ చిన్న బోర్లు వేసి అందులో ఐరన్‌, కాంక్రీట్‌ నింపడాన్ని పైల్‌ ఫౌండేషన్‌గా పిలుస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలలో పలు నిర్మాణాలకు ఈ విధానాన్నే అవలంబించారు. ఇప్పటి వరకూ రైల్వే పిల్లర్‌కు రూ.13 కోట్ల వరకూ ఖర్చు అయింది. ఇక్కడ కర్బ్‌ ఫౌండేషన్‌ పిల్లర్‌ ఒరిగి పోవడంతో ఆ మేరకు నష్టం ఏర్పడింది. కొత్తగా వేసే రెండు పిల్లర్లకు రూ.20 కోట్ల వరకూ ఖర్చు అవుతందని అంచనా. దీని పూర్తి అప్రూవల్‌ రావడానికి మరొక 15 రోజులు పట్టవచ్చని రైల్వే వర్గాల సమాచారం.

హైవే వంతెనలోనూ ఇలాగే..

30 ఏళ్ల క్రితం నిర్మించిన దిండి–చించినాడ జాతీయ రహదారి వంతెన నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో చించినాడ వైపు ఒక పిల్లర్‌ వరదల సమయంలో ఒరిగిపోయింది. దీంతో కొన్నేళ్ల సమయం తీసుకుని డిజైన్‌లో మార్పు చేసి ఆ పిల్లర్‌కు అటు, ఇటు రెండు పిల్లర్లను ఏర్పాటు చేశారు. అదే పరిస్థితి నేడు రైల్వే వంతెన నిర్మాణంలోనూ తలెత్తడం గమనార్హం.

రైల్వే వంతెన నిర్మాణంలో

సాంకేతిక ఇబ్బంది

కొత్త ఫౌండేషన్‌కు నిర్ణయం

అప్రూవల్‌ రావడానికి

మరో 15 రోజులు ఆగాల్సిందే

‘కర్బ్‌’ పిల్లర్‌ ఒరిగిపోవడంతో

నిలచిన నిర్మాణం

రూ.13 కోట్లు గోదావరి పాలు

Advertisement
 
Advertisement
Advertisement