అడ్డే లేని రెడ్‌బుక్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్డే లేని రెడ్‌బుక్‌

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉద్రిక్తత

అనుమతులు లేవని వైఎస్సార్‌ సీపీ

నాయకుడి షెడ్డు కూల్చివేత

అనుమతులు ఉన్నాయని అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌

కార్యకర్తల అరెస్టు – అంబాజీపేట స్టేషన్‌కు తరలింపు

పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

అయినవిల్లి/ అంబాజీపేట: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణ తొలగింపు పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైఎస్సార్‌ సీపీ నాయకుడు నిర్మించుకున్న ఒక పెద్ద షెడ్డును తొలగించేందుకు సిద్ధం కాగా.. అనుమతులు ఉన్నా ఎలా తొలగిస్తారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్‌కు చెందిన రేకుల షెడ్డును పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు కలిసి మంగళవారం తొలగించారు. ఏకంగా నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, పదిమంది ఎస్‌ఐలు, భారీగా పోలీసు కానిస్టేబుళ్లను మోహరించి హంగామా సృష్టించారు. జేసీబీతో షెడ్డును తొలగించారు. ఇది అన్యాయమని ప్రశ్నించి, అధికారుల చర్యలను తప్పుపట్టి అడ్డుకున్న పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావును, పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకుని పోయారు. ఈ సమయంలో పోలీస్‌, రెవెన్యూ అధికారులకు, వైఎస్సార్‌ సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షెడ్డు నిర్మించుకున్న స్థలానికి చెందిన రికార్డులు, పంచాయతీ తీర్మానం శ్రీనివాస్‌ పేరునే ఉన్నాయని అధికారులకు చెప్పారు. వీటిని తొలగించడం అన్యాయమని అడ్డుకున్నారు. షెడ్డు వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ అధికారులు షెడ్డును కూల్చి వేయడంతోపాటు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు దౌర్జన్యంగా కార్యకర్తలను నెట్టి వేశారు. వారిని అక్కడ నుంచి అంబాజీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది: జగ్గిరెడ్డి

నిబంధనలు పాటించకుండా ఎంత మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో డీ నోటిఫై చేయకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నిర్మాణాలను ధ్వంసం చేయడం దారుణమని, దీనిపై న్యాయం కోసం పోరాడుతామనిౖ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీకి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్‌ ప్రభుత్వ అనుమతులు లేకుండా షెడ్లను నిర్మించారని నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపించడం సమంజసం కాదన్నారు. మండల తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటున్నారని, ఆ సంతకం ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారా అని ప్రశ్నించారు. నిబంధనలకు వ్యతిరేకంగా, నోటీసులు ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపుతోనే షెడ్డు కూల గొట్టారని జగ్గిరెడ్డి ఆరోపించారు. ప్రజలను సంరక్షించాల్సిన పోలీసులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ కూలీలు నివాసం ఉండే షెడ్లను ధ్వంసం చేయించడం దారుణమన్నారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో తగిన ప్రతిఫలం చవిచూస్తారని హెచ్చరించారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది: గన్నవరపు శ్రీనివాస్‌

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్‌ రాసిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌ సీపీ పి.గన్నవరం కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. శ్రీనివాస్‌ తనకు చెందిన గ్రామ కంఠం భూమిలో షెడ్ల నిర్మించి, సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలకు ఆశ్రయం కల్పించారన్నారు. అయినవిల్లి మండలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని పట్టించుకోకుండా కక్ష పూరితంగా శ్రీనివాస్‌ కట్టడాలను భూస్థాపితం చేయడం దారుణమన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్‌ మోకా ఆనందసాగర్‌ అయినవిల్లి మండలం నేదునూరు కౌశిక పక్కన భూమిని ఆక్రమించుకుని నివాస గృహాన్ని నిర్మిస్తున్నారని, దానిపై ఎందుకు చర్యలు లేవని ఆయన ప్రశ్నించారు. ఎంపీపీలు దొమ్మేటి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్‌, జెడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, మందపాటి కిరణ్‌ కుమార్‌, వాసంశెట్టి తాతాజీ, కొర్లపాటి కోటబాబు, గొల్లపల్లి డేవిడ్‌ రాజు, దొమ్మేటి దుర్గారావు, మైలా ఆనందరావు, మట్టపర్తి హరి, తోరం భాస్కరం, దొమ్మేటి వెంకట నరసింహం, చిట్టూరి రాధాభాయ్‌, చాట్ల రామారావు, కుసుమ వరలక్ష్మి పాల్గొన్నారు,

పోలీసు స్టేషన్‌ ఎదుట జగ్గిరెడ్డి బైఠాయింపు

కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు అనుసరించిన కక్ష సాధింపు చర్యలు తక్షణమే విడనాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. కె.జగన్నాధపురంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగ్గిరెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో చర్చించారు. ఏ నేరం చేశారని పోలీసులు కో ఆర్డినేటర్‌ను, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని పోలీస్‌ స్టేషన్‌ బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో జగ్గిరెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్‌ అయినవారిని విడుదల చేస్తే గాని బయటకు వెళ్లేది లేదని భీష్మించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చంద్రబాబు ఆజ్ఞలకు తలవొగ్గి పనిచేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం నశించాలి, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసుల జులుం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలు బయటకు వెళితే అరెస్టు అయిన వారిని విడుదల చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement